తేట తెలుగులోన మనం మాటాడితె - మాధుర్యం
స || అమ్మపలుకులోని ఆర్ద్రత తెలిసియు
"మమ్మన్న" పిలుపుకై మంకు ఏల?
"అయ్య" - "నాయన" బాపు యననెంతొమధురము
"డాడి" యనగనెంచు దంభమేల?
అత్త - మామయు - అక్కయనినంతప్రేమయే
ఎడదలోతులనుండి ఎగిరిపడదె!
రెండు చేతులనెత్తి "దండము" మీకన్న
గుండెలవిసిపోయి కూరు ప్రియము
తే.గీ || మనసు తోడుతమాటాడు మనదు తెలుగు
దీనిమించున బాసేది తేనెకన్న
తీయనైనది తెలుగని తెలియవొక్కొ!
తెలుగువాడిగా వీడను తెలుగుననియు
తెలుగు తల్లిపై బాసతో తెలుగుకొరకు
ప్రతినజేయుము తమ్ముడా! సతమునీవు
ప్రతినజేయుము అన్నయ్యా! సతమునీవు
ప్రతినజేయుము చెల్లెలా! సతమునీవు
ప్రతినజేయుమో ప్రభుతమా! భవితనెంచి
తెలుగు రుచియు దెల్సి - తెలుగు తీపి నెరిగి
తిరుగు బాటేలనొయి ఓ! తెలుగులార!
రచన : మడిపల్లి భద్రయ్య



