RELATED EVENTS
EVENTS
టాంటెక్స్ సాహిత్య వేదికపై డా. రావూరి భరద్వాజకు ఘన నివాళి

 

 

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 75 వ సదస్సు శనివారం, అక్టోబర్ 19 వ తేది స్థానిక నందిని రెస్టారెంటులో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 75 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలాజరపుకొనే నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి అందరికీ స్వాగతం తెలిపారు. సాహిత్య వేదిక చరిత్ర లో ఒక క్రొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ మొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ నుండి అంతర్జాలం(ఇంటర్నెట్) ద్వారా సాహితీ ప్రియులు ఈ వేదికలో పాలు పంచుకున్నారు. శ్రీమతి సురేశ్ మెర్సీ జజ్జర ఇంటర్నెట్ స్కయిప్ ద్వారా ఈ వేదికలో పాల్గొని 'కవులు - కాగితం', 'విత్తనం ఆడా ?? మగా?', 'ప్రశ్నల గది' అను తమ కవితలను వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు ప్రముఖ కవి డా. కేశవ రెడ్డి గారు రచించిన “అతడు అడవిని జయించాడు” అనే నవలను సభకు పరిచయం చేశారు. ఒక ముసలివాడు ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న సుక్క పందిని అడవిలోని క్రూర మృగాల నుండి రక్షించడానికి చేసిన ప్రయత్నం, అడవిని అతడు అర్ధం చేసుకున్న విషయాలను గురించి వినిపించారు. తెలుగు నవలా చరిత్రలో ఈ నవల ఇంకో ఇరవై సంవత్సరాలకు పైగా ఈ నవల ఉత్తమ స్థానంలో నిలిచిపోతుందని అన్నారు.



ఆయులూరి బస్వి “మాసానికో మహనీయుడు” శీర్షికలో భాగం గా  అక్టోబర్ నెలలో జన్మించిన అడవి బాపిరాజు, మొక్కవోటి నరసింహ శాస్త్రి, కొడవటిగంటి కుటుంబ రావు, గిడుగు  రామముర్తి  గార్ల ను గుర్తుకు చేసుకున్నారు. మొక్కవోటి వారి బారిష్టర్ పార్వతీశం నవల గురించి, అడవి బాపిరాజు గారి “గోన గన్నారెడ్డి” నవల గురించి ఈ సందర్భంగా వివరించడం జరిగింది. శ్రీమతి కొత్త వాసంతి గారు విశ్వనాధ వారి కవితను చదివి వినిపించారు.

 





 

టాంటెక్స్ ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి గారు  ఙ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత మరియు ఇటీవలే  స్వర్గస్తులైన ప్రముఖ రచయిత డా. రావూరి భరద్వాజ గారికి శ్రద్దాంజలి ఘటించారు. తెలుగు సాహిత్య లోకం ఒక ధృవ తారను కోల్పోయిందని, రావూరి గారి జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయమనీ కొనియాడారు. డా. రావూరి  భరద్వాజ “పాకుడు రాళ్ళు” నవల ద్వారా తమ రచనా వైశిష్ట్యాన్ని, పరిశీలనా నైశిత్యాన్ని, విశ్లేషణా చాతుర్యాన్ని  కోట్లాదిమంది అభిమానులకు పంచారు.  వేదికపై  విచ్చేసిన సాహితీప్రియులదరూ  ఒక నిమిషం మౌనం పాటించి డా. రావూరి భరద్వాజ గారి మృతికి సంతాపాన్ని ప్రకటించారు.

 





టాంటెక్స్ కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథి శ్రీ యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు మాట్లాడబోయే ‘సాహిత్యము – సుభాషితాలు’ విషయాన్ని సభకు తెలియ చేస్తూ శ్రీ యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు 35 సంవత్సరాలు జాతీయ భాషకి సేవలందించి, మాతృభాషలొ తరించి, వారు తెలుగు భాషకు చేస్తున్న సేవను కొనియాడారు.  టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ పుష్పగుచ్ఛము తో వేదిక పైన ముఖ్య అతిథి శ్రీ యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారిని అభినందించారు.



శ్రీ యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు మొదటగా డా. రావూరి భరద్వాజ గారికి తన శ్రద్దాంజలి ఘటించారు. తన ప్రసంగంలో మన సాహిత్యంలో వివిధ కవులు మనకు అందించిన సుభాషితాలు, వాటి ప్రాముఖ్యతను వివరిస్స్తూ” సుభాషితాలు మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు  మార్గ దర్శకాలు. మానసిక ప్రశాంతతకు శాంతి ధూతలు. మానవ విజయాలకు నిచ్చెనలు. మంచి చెడులను తెలుసుకొని, సరైన అవగాహనను పెంచుకొని, సన్మార్గంలో వెళ్లేందుకు ఈ సుభాషితాలు నిస్సందేహంగా ఉపయోగపడతాయి” అని సోదాహరణంగా వివరించారు. ప్రాచీన శతక సాహిత్యంలోని కొన్ని ముఖ్యమైన సూక్తులను మరియు హిందీభాష లో ప్రాచుర్యం పొందిన పద్యాలను వివరించారు



టాంటెక్స్ పాలకమండలి  సభ్యడు అజయ్ రెడ్డి, అధ్యక్షుడు మండువ  సురేష్ దుశ్శాలువతో ముఖ్య అతిథి శ్రీ యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారిని సన్మానించారు. ఉత్తరాధ్యక్షుడు కాకర్ల విజయమోహన్, ఉపాధ్యక్షుడు ఊరిమిండి నరసింహా రెడ్డి,సాహిత్య  వేదిక కార్యవర్గ సభ్యులు శ్రీమతి సింగిరెడ్డి శారద, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, రొడ్డా రామకృష్ణా రెడ్డి, పున్నం సతీష్, బసాబత్తిన శ్రీనివాసులు,ఆయులూరి బస్వి, సంయుక్తంగా  ముఖ్య అతిధిని ఙ్ఞాపికతో  సత్కరించారు.  కార్యవర్గ సభ్యులు వీర్ణపు చినసత్యం,  చామకూర బాల్కి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ"నెల నెలా తెలుగు వెన్నెల" 75 వ సదస్సులో ముఖ్య ప్రసంగం చేసిన  శ్రీ యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారికి కృతఙ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన స్థానిక  నందిని రెస్టారెంటు యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన రేడియో ఖుషి, తెలుగు వన్ “టోరి” రేడియో, సతీష్ పున్నం, దేసి ప్లాజా, టివి-5, టివి-9 లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;