RELATED EVENTS
EVENTS
డాల్లస్ లో ఘనంగా ముగిసిన "నెల నెలా తెలుగు వెన్నెల" 68వ సదస్సు

 

 

 

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 68 వ సదస్సు ఆదివారం,  మార్చి 17 వ తేది స్థానిక నందిని రెస్టారెంటులో తెలుగు సాహిత్యవేదిక సమన్వయ కర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 68 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తి తో ఈ సమావేశానికి విచ్చేసారు. స్థానిక గాయని కుమారి నేహ పాడిన లలిత గీతంతో సభను ప్రారంభించారు.


సాహిత్యవేదిక  మొదటి భాగం స్వీయ రచనా పఠనంతో  అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. ఆచంట సుబ్రహ్మణ్యం తెలుగు జాతీయాల మీద ఒక క్విజ్ నిర్వహించారు. సభికులందరూ ఈ క్విజ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాడుకలో లేనటువంటి ఈ తెలుగు జాతీయాలను ఆచంట సుబ్రహ్మణ్యం ఈ క్విజ్ ద్వారా అందరికీ గుర్తు చేసారు. ప్రముఖ కవి శివారెడ్డి గారు రచించిన "దాచుకో" కవితను పున్నం సతీష్ సభకు చదివి వినిపించారు. ఆర్.ఎం.ఉమా మహేశ్వరరావు గారు వ్రాసిన ‘నోరుగల్ల ఆడది’ అన్న కథను బసాబత్తిన శ్రీనివాసులు సభకు పరిచయం చేసారు. కథా పరిచయంలో భాగంగా రచయితను సభకు పరిచయం చేసారు. పాత తరంలో దేవదాసీ సాంప్రదాయంలో ఉన్నటువంటి స్త్రీల జీవితాలు ఇప్పటి రోజుల్లో ఎలా మారాయి? పేదరికంలో ఉన్నటువంటి వారి జీవితాలను పాఠకులకు ఈ కథ ద్వారా రచయిత మనకు తెలియజేసారన్నారు.

 “మాసానికో మహనీయుడు” శీర్షికలో భాగంగా  మార్చి మాసంలో జన్మించిన  లేదా పరమపదించిన వారి జాబితాలో ప్రముఖులైన వనితా శిరోమణి తల్లాప్రగడ  విశ్వ సుందరమ్మ , మునిమాణిక్యం నరసింహారావు, దివాకర్ల తిరుపతి శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు లను టాంటెక్స్ ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహరెడ్డి సభకు  గుర్తు చేసారు. మార్చిలో పుట్టిన నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటల విశిష్ఠతను సభకు తెలియ జేస్తూ “నండూరి వెంకట సుబ్బారావు కవి బ్రహ్మ గా మారి ఎంకి-నాయుడు బావ పాత్రలు సృష్టించారు. ఈ రెండు పల్లె వాకిట విరిసిన రెండు పువ్వులు, అరమరికలు లేని అనురాగ బంధాలు, ఆ జంట ప్రణయాన్ని మధురోహల దొంతరులుగా లోకానికి పంచారు” అన్నారు. ఎంకి పాటల్లో ప్రసిద్ధి చెందిన “యెంకితో బద్రాద్రి” పాటను డా. ఊరిమిండి వినిపించారు.

 

 


డా. జువ్వాడి రమణ  “కోటి రతనాల వీణ నా తెలంగాణ” అన్న దాశరధి పాటను వినిపించారు.  తరువాత, మే నెలలో జరుగనున్న తానా 19వ మహాసభలలో పాల్గొనడానికి ఇప్పటికే టిక్కెట్లు కొన్న వారికి తానా సౌత్ వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధి  శ్రీమతి కన్నెగంటి మంజులత గారు లక్కీ డిప్ నిర్వహించారు.

 తదుపరి, ప్రస్తుత టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు రొడ్డా రామకృష్ణా రెడ్డి నేటి కార్యక్రమ ముఖ్య అతిథిని సభకు  పరిచయం చేస్తూ ““వాధూలస” కలం పేరుతొ  తెలుగు పాఠకులకు సుపరిచితులయిన కరీంనగర్  జిల్లా, ఎలగందుల నివాసి శ్రీ తుమ్మూరి రాం మోహన్  రావు ఎస్.ఆర్.ఆర్ కళాశాల నుండి బి.ఎస్సీ,  కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి బి.ఇడి, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తెలుగు లో ఎం.ఏ పట్టా పుచ్చుకొన్న అనంతరం  ఒక దశాబ్ద కాలం పాటు రసాయన శాస్త్ర నిపుణులుగా సేవలందించి,  దాదాపు  రెండు దశాబ్దాలకు పై చిలుకు ప్రభుత్వ  ఉపాధ్యాయ వృత్తిలో విధులు నిర్వహించి 2011 లో పదవీ విరమణ చేసారు. ప్రవృత్తి పరంగా నటన, రచన, వ్యాఖ్యానం,  గానం తదితర అంశాలలో ప్రావీణ్యం సంపాదించిన శ్రీ రాం మోహనరావు గారు పది నాటకాలు, పదిహేను నాటికలలో ప్రముఖ పాత్రలు పోషించి, ముప్పైకి పైగా రచనలతో చెరగని ముద్రవేస్తూ, వ్యాఖ్యాతగా ప్రముఖుల మన్ననలను అందుకొని,  భాష, కళలు, సాహిత్యానుబంధ సంస్థలకు  చేయూత నిస్తూ, తరచూ ప్రవాసంలో తెలుగు భాషా సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని తమ కంచు కంఠంతో ఆహూతులను విశేషంగా ఆకట్టుకొంటున్న శ్రీ తుమ్మూరి రాంమోహనరావు గారిని  వేదికమీదకు ఆహ్వానించగా,  పుర ప్రముఖులు డా. రాఘవేంద్ర ప్రసాద్ గారు పుష్పగుచ్చంతో ముఖ్య అతిథికి  స్వాగతం పలికారు.

 "తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలు – చదివే తీరు” అనే అంశం మీద శ్రీ తుమ్మూరి రామ్మోహనరావు గారు తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. గేయం, కవిత, జోల పాట, జానపదం, బుర్ర కథ, హరి కథలను గురించి వివరించడమే కాకుండా వాటిని తనదైన శైలిలో పాడి వినిపించారు. అల్లసాని పెద్దన, పోతన, శ్రీనాధుడి కావ్యాలలో కొన్నిపద్యాలను వివరిస్తూ, అద్భుతంగా తమ  కంచు కంఠ౦తో వాటిని ఆలపించారు.టాంటెక్స్  అధ్యక్షుడు మండువ సురేష్ మరియు ఉపాధ్యక్షుడు డా.ఊరిమిండి నరసింహారెడ్డి సంయుక్తంగా దుశ్శాలువతో ముఖ్య అతిథి శ్రీ తుమ్మూరి రామ్మోహనరావు గారిని సన్మానించారు.  తెలుగు  సాహిత్య  వేదిక కార్యవర్గ సభ్యులు  శ్రీమతి సింగిరెడ్డి శారద, రొడ్డా రామకృష్ణా రెడ్డి, పున్నం సతీష్, బసాబత్తిన శ్రీనివాసులు, ఆచంట సుబ్రహ్మణ్యం, ఆయులూరి బస్వి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా  ముఖ్య అతిధిని ఙ్ఞాపికతో  సత్కరించారు.  టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు చామకూర బాల్కి మరియు వీర్నపు చినసత్యం ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ముఖ్య అతిథి శ్రీ తుమ్మూరి రామ్మోహనరావు గారికి,  విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, తెలుగు వన్ రేడియో వారికి మరియు నందిని రెస్టారెంటు యాజమాన్యానికి కృతఙ్ఞతా పూర్వక అభివందనములు  తెలియ జేసారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;