RELATED EVENTS
EVENTS
Tantex Deepavali Celebrations

శనివారం, అక్టోబరు 29, 2011 డాల్లస్/ఫోర్ట్‌వర్త్

భారతీయ సంస్కృతికి ఇది గర్వకారణమైన రోజు. భారతీయులకు అత్యంత ప్రధానమైన పండుగ  దీపావళి.  ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం  (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఈ సంవత్సరం  దీపావళి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి.  స్థానిక  పసంద్ వారి "విందు" భోజనశాల  వడ్డించిన పసందైన పదహారణాల  సంప్రదాయ విందు తరువాత  ప్రార్థనా గీతాలాపనతో  వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

 యూలెస్ లోని ట్రినిటీ ఉన్నత పాఠశాల సభాభవనంలో నిర్వహించిన ఈ సంబరాలకు భారీ ఎత్తున దాదాపు 1000 కి పైగా డాల్లస్ ప్రాంతీయ ప్రవాసాంధ్రులు విచ్చేసారు టాంటెక్స్ సాంస్కృతిక కార్యదర్శి శ్రీ రాజేష్ చిలుకూరి దీపావళి  శుభాకాంక్షలతో  అందరినీ  అహ్వానించారు.

సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు నరకాసురుడనే భయంకర రాక్షసుని చంపి, ప్రజలందరినీ కాపాడాడు. దానికి గుర్తుగా ప్రజలంతా ఆనందంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ జరుపుకొనే పండుగే దీపావళి. స్థానిక కూచిపూడి కళాక్షేత్రం అధినేత్రి శ్రీమతి పద్మ శొంటి నేతృత్వంలో దాదాపు యాభైమంది నృత్య కళాకారులతో ప్రదర్శించిన "నరకాసుర వధ" నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకట్టుకొంది.

 

అనంతరం టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ ఎన్‌.ఎమ్‌.ఎస్. రెడ్డి తమ సందేశంలో  2011 జూలై మాసంలో ఘనంగా నిర్వహించిన టాంటెక్స్ రజతోత్సవ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన సభ్యులను మరోసారి గుర్తించి వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియ జేశారు. సాంస్కృతిక కార్యక్రమానికి అనుకున్నంత సమయం కేటాయించక పోవడం వలన వచ్చిన ఇబ్బందిని గుర్తు చేస్తూ దీపావళి కి ప్రత్యేకంగా సంగీత విభావరిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పనివత్తిడితో సతమతమౌతున్న తెలుగువారి కోసం సంస్థ చరిత్రలో మొట్టమొదటి సారి ఏర్పాటు చేస్తున్న సముద్ర విహార యాత్ర, సఖ్యత పెంపొందించేందుకు అన్నీ జాతీయ తెలుగు సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకొని రావడం, సంస్థకు కావలసిన భవనం కోసం ప్రస్తుతం జరుగుతున్న అన్వేషణ తదితర విషయాలను సభికులతో పంచుకొన్నారు.

 

నవంబరులో జరగబోయే సంస్థ ఎన్నికలలో  అరుహులైన సభ్యులంతా   చురుకుగా  పాల్గొని  ప్రజాస్వామ్య పద్దతికి మరింత బలాన్ని చేకూర్చి సంస్థ భవిష్యత్తును కాపాడాలని కోరారు. రాబోవు సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా పాల్గొని, సంస్థ ఆర్థిక పరిస్తితి మరియు రాజ్యాంగంలో ప్రవేశపెట్టనున్న మార్పులను గమనించాలని శ్రీ ఎన్.ఎమ్.ఎస్. రెడ్డి కోరారు. చలనచిత్ర యువ నేపద్య గాయనీ గాయకులు శ్రావణ భార్గవి, కృష్ణ చైతన్య ఆలాపించిన  పాటలు  ప్రేక్షకులను  ఉర్రూతలూగించాయి. అందాల తారలు విమలా రామన్, సుహాసిని ప్రదర్శించిన నృత్యం, ప్రముఖ హాస్యనటుడు చిట్టిబాబు, సహాయ నటీమణులు రాగిణి, జయలలిత, లత చౌదరి, భాస్కర్ బృందం సమర్పించిన హాస్య సన్ని వేసాలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. చాందిని వేషంలో చందూ ప్రదర్శించిన మిశ్రమ నాట్యం సభికులను రంజింప జేసి వారి హృదయాలలో గిలిగింతలు పెట్టింది.

టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ ఎన్.ఎమ్.ఎస్. రెడ్డి, ఉత్తరాధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న, ఉపాధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ మరియు కార్యవర్గ బృందం, పాలక మండలి అధిపతి శ్రీ శ్రీధర్ కోడెల కళాకారులను సాంప్రదాయ బద్ధంగా పుష్పగుఛ్చం, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. టాంటెక్స్ దీపావళి వేదికపై తెలుగు జాతీయ సంస్థలైన ఆటా, నాట్స్, నాటా, తానా తమ ప్రతినిధి బృందాలతో దర్శనమిచ్చి సంస్థలలో చేపడుతున్న ముఖ్య కార్యక్రమాల వివరాలను సభతో పంచుకొన్నారు. చివరగా  దీపావళి వేడుకల సమన్వయ కర్త మరియు కోశాధికారి డాక్టర్. సుబ్బారావు పొన్నూరు  వందన సమర్పణ చేస్తూ విచ్చేసిన  ప్రేక్షక  సమూహానికి,  పోషక దాతలైన బేలర్  మేడికల్ సెంటర్  ఆఫ్ అర్వింగ్,   హొరైజన్ ట్రావెల్, కోట ఇన్సూరెన్స్ అండ్ మోర్ట్‌గేజ్  సర్వీసెస్,  పసంద్  ఇండియన్  క్విజీన్,  పర్ఫెక్ట్ టాక్స్,   సౌత్‌ఫోర్క్ డెంటల్, మై టాక్స్ ఫైలర్, తన్మయ్ జ్వెల్లర్స్,  కార్యక్రమ పోషకదాతలైన జాతీయ తెలుగు సంస్థలు ఆటా, నాట్స్, నాటా, తానా లకు, మై డీల్స్ హబ్, లిటిల్ స్టెప్స్ మాంటిస్సోరి స్కూల్, మయూరి ఇండియా రెస్టారెంట్, వైవిల్ సిస్టంస్, ఓరీస్ ఇండియన్ క్విజీన్, మరియు  ప్రసార మాధ్యమాలుగా భాగస్వామ్యం వహించిన యువ రేడియో, రేడియో ఖుషి,  టివి9, దేశిప్లాజా, ఫనేషియా ట్రినిటీ ఉన్నతపాఠశాల యాజమాన్యానికి   కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;