RELATED EVENTS
EVENTS
Sukheebhava in Texas - A new Initiative

పాతికేళ్ళకు పైగా ఉత్తర టెక్సాస్ లో, ముఖ్యంగా డాలస్ మహానగరంలో ఉన్న, తెలుగు వారికి ఎన్నో విభిన్న రీతులలో సేవలందిస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్), గత ఆదివారం, అంటే ఏప్రిల్ 22వ తేదీన సుఖీభవ అన్న మరిక బృహత్తర విభాగానికి శ్రీకారం చుట్టింది. ప్లేనోలోని ఇండియన్ రెస్టారెంట్ వారి సమావేశాల గదిలో టాన్ టెక్స్ ఉత్తరాధ్యక్షుడు, మండువ సురేష్ నేతృత్వంలో సుఖీవన సమావేశ పరంపరలకి నాంది పలకడం జరిగింది.

 

North tantex, north tantex telugu association, tantex sukhibhava, texas sukhibhava, teluguone nri news

 

ప్రవాసాంధ్ర పౌరులు, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా, సాంఘిక పరంగా ఎన్నో బాధ్యలతని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వీటన్నిటిలో విజయాన్ని, ఉన్నతి సాధించే ప్రక్రియలో, ఈ తెలుగు నాయకులు, ఒక కీలక విజయం పైన అంత శ్రద్ద వహించడంలేదు. అదేమిటంటే, తన స్వంత వ్యక్తిత్వ మరియు ఆరోగ్య పరిరక్షణ. గురజాడ గారు స్వంత లాభం కొంతమానుకో, పొరుగువాడికి తోడుపడవోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్నారు. అంతేకానీ స్వంత క్షేమం మానుకో అని కాదు. ఒక్కోసారి, ఆ గురజాడ సూక్తిని అక్షరాల పాటిస్తూ తీయడంలో, కాస్త ఎక్కువ ఒత్తిడికి లోనవుతామేమోననిస్తుంది.. మనసు సంబందించిన వివిధ పార్శ్వాలు, మనలనుంచి విలువైన సమయాన్ని, శక్తిని, యుక్తిని, ప్రతిభని, కార్యదక్షతని, నాయకత్వ లక్షణాలని నిత్యం కోరుకుంటాయి. వాటన్నిటికి న్యాయం చేస్తూ, అన్ని చోట్ల మన్నన పొందుతూ, మానసిక ఆనందాన్ని, సంతృప్తిని అత్యున్నత స్థాయిలో పొందడం అంత తేలికైన విషయమేమీ కాదు. దానికొక నిర్దుష్టమైన మార్గం, దిశా నిర్దేశకత్వం, ప్రణాళిక, పద్దతి, క్రమశిక్షణతో కూడిన పరిశ్రమ, ముఖ్యమైన వనరులు అవసరం. మరి ఆ మార్గాన్ని కనుకొని, ఆ దిశలో అందరూ కలిసి నడవడానికి సహాయంగా ఏర్పాటు చెయ్యబడ్డ విభాగమే. సుఖీభవ! స్వంత క్షేమం కొంతచూసుకో, పొరుగు వాడికి తోడుపడవోయ్. గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్న కొత్త తలంపుతో, నేను ముఖ్యం అన్నభావన స్వార్థపూరితం కాదు. అది లోకకల్యాణానికి ఎంతగానో అవసరం అన్న విభిన్న ధోరణితో, మొదలయినదే ఈ సుఖీభవ. జీవితం అనేది మనకివ్వబడిన ఒక అద్భుతమైన కానుక, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అన్న సూత్రంతో ఏర్పడ్డ వేదిక, ఈ సుఖీభవ!

 

 

 

టాన్ టెక్స్ ఉత్తరాధ్యక్షుడు, మండువ సురేష్ మనోనేత్రంలో వెలసిన ఈ ఆలోచన వ్యవస్థికరణకు గత ఆదివారం అంకురార్పణ జరిగింది. తన నేతృత్వంలో జరిగిన మొదటి సుఖీభవ సమావేశం. ముందుగా మండువ సురేష్ సుఖీభవ ముఖ్య ఉద్దేశ్యాలను, లక్ష్యాలను, ప్రణాళికను వివరించడంతో ప్రారంభమయ్యింది. తరువాత టాన్ టెక్స్ అధ్యక్షులు దమ్మన్న గీతగారు, ఈ మంచి ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చినందుకు టాన్ టెక్స్ కార్యవర్గ నాయకులని అందరినీ అభినందించారు. సుఖీభవ అనుకొన్న లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతం అవుతుందని నమ్మకాన్ని, దానికి అందరి సహకారాన్ని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి టాన్ టెక్స్ నాయకత్వ సహాయాన్ని ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు. తరువాత, ముఖ్య వ్యక్తులుగా వచ్చిన రమాకాంత్, నిత్యజీవితంలో ఒత్తిడి ప్రభావం తగ్గించుకోవడం ఎలా? అన్న అంశంపైన మాట్లాడారు. యోగా ప్రక్రియలో ప్రాణాయామ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, కొన్ని చిన్న ప్రాణాయామ చిట్కాలను అందరిచేతా చేసి చూపించారు.

 

 

మనం తినే తిండిలో సమతుల్యత – స్మార్ట్ ఫుడ్ డెలివరబుల్స్ అన్న అంశం మీద. డాక్టర్ సప్నా పంజాబీ-గుప్త మాట్లాడుతూ మన దేశీయ వంటకాల్లో ఉన్న సంపూర్ణ ఆరోగ్యానికి ఆధారమైన అద్భుతమైన రహస్యాలని చక్కగా ఉదాహరణలతో వివరించారు. శాఖాహారంలో వివిధ పదార్థాలలో ఉన్న పోషక విలువలు. మనం రోజు కనుక్కొనే ఆహార వస్తువుల పాకేజీల మీద ఉన్న కేలరీల పట్టికను ఎలా చదవాలి అన్న ఎన్నో విలువైన విషయాలను తను వివరించారు. ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నోత్తర చర్చలతో ఆ ప్రసంగం ముగిసింది.

 

తర్వాత, మనలో నాయకత్వలక్షణాలను పెంచడానికి వ్యక్తిత్వం ఎంతవరకు సహాయపడుతుంది? టోస్ట్ మాష్టర్స లాంటి అంతర్జాతీయ స్థాయి కలయిన వెళ్తూ, మనం ఒక వర్తక క్లబ్ ని ఎలా మొదలు పెట్టగలం? దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏవి? అన్న అంశంమీద స్థానిక మరాఠీ మిత్రుడు వివేక్ ఘనేకర్ మాట్లాడారు. ఎంబీయే చదివిన వివేక్. స్వతహాగా మంచి వక్త, టోస్ట్ మాస్టర్స్ ద్వారా ఎన్నో మెళకువలు నేర్చుకున్నవారు. తన జీవితంలో 9-11రోజుల అనుభవాల గురించి ప్రసంగం ఇచ్చి... ఒక మంచి వ్యక్తి ఎలా మాట్లాడతారో, ఒక ఉదాహరణ చూపించారు. టోస్ట్ మాస్టర్స్ లేలా పని చేస్తుంది. దానివల్ల ఉపయోగాలు వివరించారు. గొప్ప గొప్ప నాయకులకి వారి ప్రసంగబలం వారి విజయాలకి ఎలా సహాయ పడిందో తెలిపారు. వివేక్ సహాయంగా రాయబారం భాస్కర్, పోనంగి గోపాల్ కూడా తమ తమ టోస్ట్ మాస్టర్స్ అనుభవాల్ని అందరితో పంచుకున్నారు.

 

 

మన ఆరోగ్య పరిరక్షణకి పరుగు ఎంత ముఖ్యమో తెలుసుకోవడం కోసం రన్ మామా రన్ అన్న శీర్షికలో, డాలస్ నగరపు తెలుగువారిలో, ఎనిమిది మారథాన్ లు పూర్తి చేసుకుని, పరుగుపందేల వీరుడు అనదగ్గ, పోనంగి గోపాల్, తన స్వీయ అనుభవాలతో కలిసి అతి చక్కటి ప్రసంగం ఇచ్చారు. అసలు పరుగెత్తడం వల్ల ఉపయోగాలు, ఎలా మొదలు పెట్టడం, ఎలాంటి బూట్లు కొనుక్కోవాలి. ఎలాంటి ఆహారం తినాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చక్కగా వివరించారు. గోపాల్ కి సహాయంగా, స్వతహాగా మారథాన్ పందేలు పూర్తిచేసిన వివేక్ ఘనేకర్ మరియు రాయవరం విజయ బాస్కర్, తామూ తమ జీవితాల్లో పరుగుల ప్రయాణాలు ఎలా మొదలు పెట్టారు, వాటిలో నేర్చుకున్న పాఠాలు, అనుభావాలు పంచుకొన్నారు. తర్వాత విద్యాదానం సంస్థ, సిలికానాంధ్ర మనబడి మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహించబోతున్న అయిదు కి.మీ. పరుగు పందెం మరియు పిల్లల మారథాన్ గురించి లాంఛనంగా ప్రకటన ఇచ్చారు. ఇది జూన్ 10 న ఉదయం 9 గంటలకు ప్లేనోలో రస్సెల్ క్రీక్ పార్క్ లో జరుగుతుంది. ఇది ఉత్తర అమెరికాలోనే తెలుగువారు నిర్వహిస్తున్న మొట్టమొదటి పరుగు పందెం.

 

 

సభ చివర్లో "సుఖీభవ" జట్టు సభ్యులు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వందన సమర్పణ చేస్తూ విచ్చేసిన అతిధులకు, ముఖ్యవ్యక్తులకు, మరియు ఆతిధ్యమిచ్చిన జైహూ ఇండియన్ రెస్టారెంట్ వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ జట్టు సభ్యులు కోరాడ కృష్ణ, చిట్టిమల్ల రఘు, వనం జ్యోతి మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;