RELATED EVENTS
EVENTS
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 71వ నెలనెలా తెలుగువెన్నెల

 

వ్యావహారిక భాషోద్యమ పితామహునికి నీరాజనం: ఘనంగా ముగిసిన టాంటెక్స్ 71వ నెలనెలా తెలుగువెన్నెల

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 71 వ సదస్సు ఆదివారం, జూన్ 16 వ తేది స్థానిక నందినీ రెస్టారెంటులో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 71 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. స్థానిక గాయని శ్రీమతి జ్యోతిసాధు ప్రార్థనా గీతంతో పాటు మరికొన్ని లలిత గీతాలతో సభను ప్రారంభించారు.


సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలా జరపు కొనే నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి  అందరికీ స్వాగతం తెలిపారు.సాహిత్యవేదిక మొదటి భాగం నవరసభరితమయిన కవితా పఠనంతో అత్యంత ఆసక్తికరంగా జరిగింది.  ప్రస్తుతం ప్రవాసంలో పర్యటిస్తున్న శ్రీ తాడేపల్లి శ్రీరామకుటుంబం నన్నయ కవితను చదివి వినిపించారు. హరికథలు మన ప్రాచీన ఇతిహాసాల సారాంశాన్ని చక్కగా అద్దం పట్టి మనకు ప్రతిబింబించే విధంగా చూపించడం సాంప్రదాయం. శ్రీ అశ్విన్ కౌతా కోదండ రామయ్యను హరికథా రూపంలో   కళ్ళకు కట్టినట్లుగా చూపించి అందరినీ ఆకట్టుకున్నారు.  డా.జువ్వాడి రమణ   నన్నయ పద్యాలు పాడి అందరి మన్ననలు పొందారు. కవిత, పద్యాలకు ఆటవిడుపుగా శ్రీ బి .చుక్కయ్య తమ హాస్యోక్తులతో అందరినీ  నవ్వుల్లో ముంచెత్తారు. ఇటీవల దివంగతులైన శ్రీ కైకలూరి ప్రసాద్  మానవ హక్కులపై వ్రాసిన  పద్యాన్ని శ్రీ సాజీ గోపాల్  చదివి వినిపించారు. సినీ సాహిత్యంలో ఆణిముత్యాల గురించి శ్రీమతి సింగిరెడ్డి శారద మాట్లాడుతూ ప్రముఖ గేయ కవులయిన శ్రీ సముద్రాల మరియ శ్రీ దేవుల పల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యంలోని ప్రధాన ఘట్టాలను వివరించారు.  వాటిలోని ఆణిముత్యాలను శ్రీమతి జ్యోతి సాధు  శ్రావ్యంగా పాడి అందరినీ అలరించారు. టాంటెక్స్ పాలక మండలి పూర్వాధిపతి డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి “జయ” అనే పదంతో మొదలయ్యే మూడు కృష్ణశాస్త్రి పాటలను తనదైన శైలిలో పాడి ఆహూతులను అలరించారు.

 టాంటెక్స్ కార్యదర్శి మరియు తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” శీర్షిక లో భాగంగా అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు కీ.శే. ఆరుద్ర మరియు ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కీ.శే.  పాలగుమ్మి పద్మరాజుల సాహితీ  చరిత్రలో మధురమైన సన్నివేసాలను గుర్తు చేసారు.  ప్రతినెలా జన్మించిన మరియు పరమపదించిన మహనీయులను గుర్తుచేసుకోడానికి స్థాపించిన ఈ “మాసానికో మహనీయుడు” శీర్షిక సందర్భంగా జూన్ లో పుట్టిన ఇతర తెలుగు ప్రముఖులు బుచ్చిబాబు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, భద్రిరాజు కృష్ణమూర్తి, ముళ్ళపూడి వెంకటరమణ, దివాకర్ల వెంకటావధాని, మరియు జూన్ లో   కీర్తిశేషులయిన శ్రీశ్రీ, మరియు కరుణశ్రీ గారిని సభకు గుర్తు చేసి వారి విశిష్ఠ సేవలను కొనియాడారు.


19వ తానా మహాసభలలో సాహిత్య వేదిక కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడంలో సహకరించిన తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులకు, సాహితీ ప్రియులకు మరియు సహ-ఆతిథ్యం అందించిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గ బృందానికి  ఆ సంస్థ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ విజయ చంద్రహాస్ మద్దుకూరి కృతఙ్ఞతలు తెలిపారు. సినీ సాహిత్యం గురించి, హరికథ ప్రాచుర్యం గురించి కొన్ని విషయాలను శ్రీ మద్దుకూరి  సభతో పంచుకున్నారు.

 
జులై మొదటి వారంలో డాల్లాస్ లో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాట్స్) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాహిత్య కార్యక్రమాల వివరాలను మూడవ తెలుగు సంబరాల సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ  మల్లవరపు అనంత్ సభకు వివరించి, అందరినీ ఆహ్వానించి కార్యక్రమాలను జయప్రదం చేయమనికోరారు.


సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద   నేటి ముఖ్య అతిథి శ్రీమతి నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి గారిని సభకు పరిచయం చేస్తూ “శుభ వేడుకలకు అక్షరాలతో అక్షింతలు వేసి అభినందన చందనాలను పంచే సుమనోహర మాతృమూర్తి కి సాదర స్వాగతం. “విమల” అనే కలం పేరుతో తెలుగు పాఠకులకి సుపరిచితులైన శ్రీమతి నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు లో ఎం.ఏ మరియు బి.ఇడి పట్టాలు  పుచ్చుకొన్నఅనంతరము దాదాపు  రెండు దశాబ్దాలకు పై చిలుకు తెలుగు అధ్యాపకులుగా విధులు నిర్వహించారు. తెలుగు కవితా పఠనం, రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి మరింత దగ్గరయ్యారు. తెలుగు గుణింతాల అందాన్ని, తెలుగు భాష  మరియు జాతీయాల ప్రాముఖ్యతను “కులుకుల పలుకులు”  అనే పుస్తకం ద్వారా జనబాహుళ్యానికి పంచి పెట్టారు. వక్తృత్వం, కవితల పోటీలలో ఎన్నో ఉత్తమ బహుమతులను అందుకొని, తెలుగు భాషాభివృద్ధికి అత్యున్నత సేవలందించారు” అని కొనియాడారు.

 
“జయము జయము జయము ..జగమెరిగిన విఖ్యాతికి ...శుభము శుభము శుభము ..శుభలక్షణ వికతికి” అనే వేదఘోష తో తమ ప్రసంగాన్ని వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి అందించిన సేవలను ఒక వినూత్న కథానిక శైలిలో అందరికీ అతి సులువుగా అర్ధం అయ్యేటట్లు అద్దం పట్టి చూపారు. ముఖ్య అతిథి ప్రసంగానంతరం జ్ఞాపికతో టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ మండువ సురేష్  మరియు  పాలక మండలి పూర్వాధిపతి డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా సత్కరించారు.టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ మండువ సురేష్ మాట్లాడుతూ 71వ సదస్సు అత్యంత ఆసక్తికరంగా జరగడం తమకు అన్నారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు శ్రీ కాకర్ల విజయమోహన్, ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీ వీర్ణపు చినసత్యం, శ్రీ దేవిరెడ్డి సునిల్, పాలక మండలి అధిపతి డా. సి.ఆర్.రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 


తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ"నెల నెలా తెలుగు వెన్నెల" 71 వ సదస్సు ను వ్యావహారిక భాషా పితామహులయిన శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి 150 జయంతి సందర్భంగా ఆయనకు అంకితం చేసారు. కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన స్థానిక నందినీ రెస్టారెంటు యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, టీవీ5, టీవీ9, రేడియోఖుషి మరియు తెలుగు వన్ రేడియో (టోరి) లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;