షర్మిల కుమార్తె వివాహం.. జగన్ యూరప్ టూర్ లింకేంటి?
Publish Date:Sep 19, 2026
Advertisement
వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి, రాజకీయ విభేదాలు సమసిపోయేలా లేవు. తాజాగా వైఎస్ కుటుంబం ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని ఆశించిన వైఎస్ అభిమానుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి కుటుంబ వేడుకల్లో కలవడం కద్దు. అయితే.. వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ వివాహానికి హాజరు కాకుండా స్కిప్ చేయడానికా అన్నట్లు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, షర్మిల సోదరుడు అయిన జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. షర్మిల కుమార్తె వివాహం, జగన్ విదేశీ పర్యటన రెంటినీ బేరీజు వేస్తూ.. ఆ వివాహ వేడుకకు దేశంలోనే ఉండి హాజరు కాకపోతే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందన్న భావనతోనే జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు. వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం డాక్టర్ సోమలా రఘురామ్ రెడ్డితో నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా షర్మిల తన కుమార్తెతో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్‌ను సందర్శించారు. అక్కడ దివంగత నేత వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించి, తొలి వివాహ పత్రికను ఆయన పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు కోరారు. ఇక వివాహ పనులు కుటుంబ పరంగా ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లో, సెప్టెంబర్ 25న బెంగళూరులో వివాహ నిశ్చయ తాంబూలాలు, ఎంగేజ్మెంట్ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 25న వివాహం జరగనుంది. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. మరోవైపు, సరిగ్గా ఇదే సమయానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటన కోసం సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. దాదాపుగా అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 మధ్య కాలంలో సుమారు 25 రోజుల పాటు యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు 15 రోజుల విదేశీ ట్రిప్ కు అనుమతి ఇచ్చింది. జగన్ విదేశీ పర్యటన షెడ్యూల్, షర్మిల కుమార్తె రిసెప్షన్, వివాహ తేదీలు క్లాష్ అయ్యేలా ఉండటం గమనార్హం. ఆ విషయమూ మరోసారి షర్మిల, జగన్ మధ్య విభేదాలు, ఆస్తుల పంచాయతీపై చర్చను తెరపైకి తెచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి. వైఎస్ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదాలు ప్రజల్లోనూ, మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. షర్మిల కుమార్తె వివాహం, జగన్ విదేశీ పర్యటనకు సంబంధించిన తాజా పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. [YS Sharmila, YS Jagan Mohan Reddy, Anjali Reddy Marriage, YS Family Disputes, Jagan Foriegn Tour, Telugu One]
http://www.teluguone.com/news/content/ys-sharmila-25-231884.html




