ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం

Publish Date:Oct 6, 2022

Advertisement

దేశంలో తెలంగాణ మోడల్ అంటూ మొదలు పెట్టి ఏకంగా జాతీయ పార్టీనే ఏర్పాటు చేసిన కేసీఆర్ కు నిస్సందేహంగా ఆ పార్టీ ఆవిర్బావ వేడుక నిరుత్సాహాన్ని కలిగించి ఉంటుంది. థర్డ్ ఫ్రంట్ అంటూ మొదలు పెట్టి.. అనేక ఆప్షన్లను పరిశీలించి.. ఏవీ కలిసి రాక చివరకు తానే సొంతంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రారంభించారు. అట్టహాసంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనేలా సాగింది.    

తెరాస రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్న కార్యక్రమంలో, పార్టీ ముఖ్యుల్లో ముఖ్య నాయకురాలు, కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎందుకు కనిపించలేదు. ఆమె ఎక్కడున్నారు? ఆమె ఎందుకు దూరంగా ఉన్నారు?  ఢిల్లీ లిక్కర్ మరకల కారణంగా పెద్దలు ఆమెను పక్కన పెట్టారా? జాతీయ మీడియా కంట పడకుండా ఉండేందుకు ఆమె తెర చాటున ఉండి పోయారా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే బీఆర్ఎస్ ఆవిర్బావ వేడుకకు ఎవరెవరో వస్తారని ప్రచారం జరిగినా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామీ, ఆయన వెంట వచ్చిన  ముగ్గురు  నలుగురు ఎమ్మెల్యేలు మినహా  నలుగురికీ తెలిసిన ముఖం మరోటి కనిపించలేదు. రైతు నాయకులు కొద్ది మంది వచ్చారు కానీ ప్రముఖులు లేరనే అంటున్నారు.

అందుకు కారణం వచ్చిన రైతు నాయకులలో రాకేశ్ తికాయత్ లేకపోవడమే. నిజానికి తికాయత్ కేసీఆర్ జాతీయ రాజకీయాలకు రైతుల తరఫున పెద్ద మద్దతుదారుగా ఇప్పటి వరకూ కనిపించారు. ఆయన నాయకత్వంలోనే జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల రైతు నాయకులు ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. అటువంటి తికాయత్ బీఆర్ఎస్ ఆరంబ వేడుకకు రాలేదు. అలాగే నెల రోజుల కిందట పలు రాష్ట్రాల నుంచి వచ్చి ప్రగతి భవన్ ఆతిథ్యం అద్నుకున్న రైతు నాయకులలో సగం మంది కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో కనిపించలేదు. అంటే దీనిని బట్టి కేసీఆర్ జాతీయ పార్టీ దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపలేదనే చెప్పాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదైనా ఒకటే.  కేసీఆర్ సర్కార్ కీ, కేసీఆర్ పార్టీకీ సమస్యలూ, ఇబ్బందులు, అసంతృప్తి బెడదలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.

ఏమీ మారలేదు. పేరు మార్పుతో అన్ని చిటికెలో మారిపోతాయి, సమసిపోతాయి అన్నట్లుగా కేసీఆర్ ఇచ్చిన బిల్డప్ అంతా ఉత్తిదేనని తేలిపోయింది. దీంతో ఇంత కాలంగా దేశ్ కీ నేతా అంటూ దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల వ్యయంతో జారీ చేసిన ప్రకటనల ఫలితం దక్కకుండా పోయిందనే చెప్పాలి. కాలికి బలపం కట్టుకుని తిరిగినట్లుగా ఆయన రాష్ట్రాలు తిరిగి పలువురు బీజేపీయేతర పార్టీల అధినేతలతో జరిపిన చర్చలన్నీ విఫలమయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్జేడీ, జేడీయూలపై ఆయన పెట్టుకున్న ఆశలు సైతం నీరుగారిపోయాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ కానీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కానీ కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభకు రాలేదు. వారిని తానే వద్దన్నానని ఫేస్ సేవింగ్ కోసం కేసీఆర్ చెప్పుకున్నా.. కనీసం కేసీఆర్ కొత్త పార్టీ ఆవిర్భావ సందర్భంగా అభినందనలు తెలుపుతూ కనీసం ఒక్కటంటే ఒక్క సందేశం కూడా వారి నుంచి రాలేదు.

వాళ్లిద్దరనేమిటి ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ ను తీవ్రంగా వ్యతిరేకించే.. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్.. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్..ఇలా ఎవరూ కూడా బీఆర్ఎస్ ఆవిర్బావాన్ని గుర్తించలేదు, అక్నాలెడ్జ్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన జాతీయ పార్టీయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కనీసం సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి మద్దతూ లభించినట్లు కనిపించదు. బీఆర్ఎస్ కు మద్దతుగా ఇప్పటి వరకూ బహిరంగంగా మాట్లాడిన ఒకే ఒక్క ఏపీ వ్యక్తి.. రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ ఎప్పుడూ రాజకీయాల గురించే మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే. ఒక ఫాలోయింగ్ లేదు, ఒక పార్టీ ప్రతినిథి కాదు.. కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే ఉండవల్లి మద్దతు ఇచ్చారని  చెప్పుకోవాలి. అది కూడా ఆయన ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే.. అదీ తనకు ఓటు ఉన్న రాజమహేంద్ర వరం నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెడితే తన ఓటు వేస్తానని చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టినా.. తెలంగాణ వాదానికి బద్ధ వ్యతిరేకి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయాలకే దూరం అయిన వ్యక్తి ఇప్పుడు ఆ తెలంగాణ భావజాలానికి కేరాఫ్ అడ్రస్ లాంటి కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు ఇవ్వడమే విశేషం.  

ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏపీపై ఎలా ఉంటుందన్న విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఏపీలో ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అన్న విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పేరు మార్చుకుని జాతీయ పార్టీ అన్నంత మాత్రాన ఆ పార్టీకి ఆదరణ వచ్చేస్తుందని భావించడం భ్రమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ఏపీపై దృష్టి సారించడం ఇదే ప్రథమం కాదు. గతంలో అంటే రాష్ట్ర విభజన సమయంలోనే అంటే 2014 ఎన్నికలలోనే ఏపీలో తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా జగన్ కు మద్దతు పలికారు. అయితే ఆ మద్దతు అప్పుడు ఎలాంటి ప్రభావాన్నీ చూపలేదు. అయితే ఆ తరువాతి ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో మాత్రం కేసీఆర్, జగన్ ల ‘మైత్రి’ ఇక్కడ అంటే ఏపీలో జగన్ కు ఫలించింది. అయితే అది ఏపీ జనం తెలంగాణ రాష్ట్ర సమితిని ఆదరించారని కానీ, కేసీఆర్ తెలంగాణ వాదానికి మద్దతుగా నిలిచారనీ అర్ధం కాదు.

కేసీఆర్ అప్పట్లో వైసీపీకి ఇచ్చిన మద్దతు ఆర్ధిక సంబంధమైనది. హైదరాబాద్ నుంచి ఏపీలో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సహకారమూ అందకుండా కట్టడి చేయడానికి సంబంధించింది. అంతే కానీ విభజన నాటి గాయాలను ఏపీ జనం మరచిపోయారని అనుకోవడానికి లేదు. అలాగే అప్పట్లో తెలుగుదేశం పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత, జగన్, కేసీఆర్ ల మైత్రి కారణంగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస లబ్ధి పొందింది. అందుకు ప్రత్యుపకారంగానే 2019 ఎన్నికలలో వైసీపీకి తెరాస సహకారం అందించింది. అయితే ఈ ఐదేళ్లలో పరిస్థితులలో మార్పు వచ్చింది. అప్పటి మైత్రి ఇప్పుడు ఇరు పార్టీలూ గౌరవించి పరస్పర సహకారం అందించుకునే పరిస్థితులు లేవు. సమయం వచ్చినా రాకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా.. తెరాస మంత్రులు తమ పాలనను పొగుడుకునేందుకు పొరుగున ఉన్న ఏపీనీ, ఏపీలో అధ్వాన పాలననూ తూర్పారపడుతూనే ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు వైసీపీ అండగా నిలిచే అవకాశాలు అంతంత మాత్రమే. అలా కాకుండా, గత ఎన్నికలలో కలిగిన లబ్ధిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ, బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ లు జట్టు కట్టినా ఒనగూరే రాజకీయ ప్రయోజనం శూన్యమేనని అంటున్నారు.  ఎందుకంటే.. ఆ ఎక్స్ పరిమెంట్ కాలపరిమితి నాటి ఎన్నికలతోనే ముగిసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇప్పటి వరకూ తెలంగాణలో అధికారంలో ఉండి ఏపీ ప్రయోజనాలకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు ఏపీలో జనం మద్దతు పలకడం అనుమానమే అంటున్నారు. ఇక అదే బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన ఉంటే.. 2019 ఎన్నికలలో వైసీపీకి ఒనగూరిన ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత (యాంటి ఇంకంబెన్సీ) కారణంగా తెలంగాణలోని టీడీపీ అభిమానులు, సీమాంధ్రులు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో గత ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఏపీలో వైసీపీకి ఎటువంటి సహకారం అందిందో.. అటువంటి సహకారం ఈ సారి తెలుగుదేశంకు అందే అవకాశాలున్నాయి.

అంటే పరస్పరం ఇరు పార్టీలూ లాబపడతాయన్నది పరిశీలకుల విశ్లేషణగా ఉంది. బీఆర్ఎస్, తెలుగుదేశం మైత్రిని బూచిగా చూపి ఏపీలో వైసీపీ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేసినా అది పెద్దగా ఫలితం ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఇంత కాలం అధికారంలో ఉండి కూడా ఆంధ్రకు తెలంగాణ చేస్తున్న అన్యాయంపై గొంతెత్తకపోవడమే కాకుండా   హైదరాబాద్ లో ఏపీకి సంబంధించిన  వేల కోట్ల రూపాయల అస్తు ల‌నుఅప్పనంగా అప్పగించి, ఇప్పుడు రాజకీయ అవసరం కనుక సెంటిమెంటును రెచ్చగొట్టాలని చూస్తే అది బూమరాంగ్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు.  అంటే  బిఆర్ ఎస్‌, టీడీపీతో  జతకడితే దాని వల్ల తెలంగాణలో కేసిఆర్ తిరిగి అధికారం నిల బెట్టుకునే అవకాశం, ఆంధ్రలో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి పెరిగిన సానుకూలతకు తోడు పోల్ మేనేజ్ మెంట్ కు  కావలసిన అదనపు హంగులు తెరాస నుంచి పొంది టీడీపీ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ప్రదాన ప్రతిపక్షంపై ప్రజల్లో సానుకూలత ఉన్న ఈ సమయంలో ప్రయెూగాలు చేసి పాడు చేసుకోవాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం లేదని అంటున్నారు. బీఆర్ఎస్ తో అవగాహనా, మైత్రీ, పొత్తూ లేకున్నా తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఉండదనీ అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పై ప్రజావ్యతిరేకత తీవ్రతను బట్టి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం ఉందన్నది ప్రస్ఫుటమౌతోంది. జనసేన వంటి పార్టీలు రంగంలో ఉన్నా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు బలమైన విపక్షం వైపే మొగ్గు చూపుతారు తప్ప జనసేన వంటి చిన్న పార్టీలవైపు కాదని విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా 2019 ఎన్నికలలో దాదాపు అన్ని స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమవ్వడాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఇక ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ ఏపీలో సొంతంగా పోటీ చేసినా ఆ పార్టీకి పడే ఓట్లు వైసీపీ నుంచే చీలుతాయనీ, ఇది వైసీపీ విజయావకాశాలను తక్కువలో తక్కువ 15 స్థానాలలో ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో విపక్షం ఓట్లు కూడా కొన్ని బీఆర్ఎస్ వైపు మళ్లినా అది అర శాతం కూడా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. బీఆర్ఎస్ ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపినా ఆ మేరకు తెలుగుదేశం పార్టీకే లబ్ధి చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.