మళ్లీ దీదీకే బెంగాల్ పట్టం?
Publish Date:Apr 29, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో దేశమంతా ఇప్పుడు కోల్కతా వైపు ఆసక్తిగా చూస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల చివరి విడత ఓటింగ్ ముగిసిన వెంటనే పలు జాతీయ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించాయి. బెంగాల్ పీఠంపై మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ) అధికారంలోకి వస్తుందా అనే ఉత్కంఠకు ఈ సర్వేలు మరింత ఆజ్యం పోశాయి. వివిధ సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. బెంగాల్ పోరు హోరా సాగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా'తన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం టీఎంసీకి 148 నుంచి 160 స్థానాలు, బీజేపీకి 120 నుంచి 135 స్థానాలు దక్కుతాయి. అదలా ఉండగా.. కొన్ని సర్వేలు బెంగాల్లో కమలం వికాసం తథ్యమని పేర్కొన్నాయి. చాణక్య స్ట్రాటజీస్, జన్ కీ బాత్ వంటి సంస్థల సర్వేలు బెంగాల్ లో అధికారం బీజేపీకే అని పేర్కొన్నాయి. చాణక్య అంచనాల ప్రకారం బీజేపీకి 150 నుంచి 160 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా.. , టీఎంసీకి 130 నుంచి 140 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పీ-మార్క్ సర్వే అయితే బీజేపీకి గరిష్టంగా 175 స్థానాలు రావచ్చని.. టీఎంసీ.. 118 నుంచి 138 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఇక కొన్ని సర్వేలైతే.. బెంగాల్ లో టీఎమ్సీ, బీజేపీ మధ్య తేడా అత్యంత స్వల్పమని తేల్చాయి. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సగటు అంచనాల ప్రకారం టీఎంసీ 144 స్థానాలు, బీజేపీ 143 స్థానాలు సాధించవచ్చని పేర్కొనడం గమనార్హం. అంటే ఇక్కడ కేవలం ఒక్క సీటు తేడాతో అధికారం ఎవరికి దక్కుతుందనేది తేలే అవకాశం కనిపిస్తోంది. టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ మాత్రం మమతా బెనర్జీకే ఆధిక్యం ఉంటుందనీ.. ఆ పార్టీ 155 నుంచి 170 స్థానాలలో విజయం సాధిస్తుందనీ అంచనా వేసింది. మొత్తంగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచీ ఉద్రిక్తతలు కొనసాగాయి. మమతా బెనర్జీ తన సొంత ఇలాకాను కాపాడుకోవడానికీ, కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, మోదీ బెంగాల్లో పాగా వేయడానికి సర్వశక్తులూ ఒడ్డారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టమవుతోంది. అయితే.. బెంగాల్ ప్రజలు 'దీదీ' పక్షాన నిలిచారా లేక మోదీ పరివర్తన్ నినాదానికి జై కొట్టారా అనేది ఫలితాలు వల్లడయ్యే వరకూ వేచి చూడాల్సింది. గతంలో నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారనే వార్తలు వచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు మతపరమైన ధ్రువీకరణ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు తమకు లాభిస్తాయని బీజేపీ ఆశాభావంతో ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి ఈ ఎన్నికల్లో నామమాత్రపు ప్రభావానికే పరిమితం కావచ్చని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయి. చాలా సర్వేల్లో వారు ఒంటి సంఖ్యకే పరిమితమవుతారని అంచనా వేశారు. మొత్తానికి బెంగాల్ ఓటర్ల తీర్పు ఈసారి ఎవరికి పట్టం కడుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీదీ తన పట్టు నిలుపుకుంటారా? మోదీ హవా బెంగాల్ కోటను దాటుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది.
http://www.teluguone.com/news/content/west-bengal-assembly-elections-25-218602.html





