వాటాల కోసమే స్టీల్ ప్లాంట్ పై జగన్ రెడ్డి మౌనం?
Publish Date:Jul 8, 2021
Advertisement
ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అంగట్లో అడ్డగోలుగా అమ్మేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. కన్సల్టెంట్ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్ముతామని ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి పెట్టింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ సంస్థల అమ్మకానికి వీలుగా లీగల్ అడ్వైజర్ ఎంపికకు కేంద్రం ఈ టెండర్లను ఆహ్వానించడంతో మరోసారి కలకలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కార్మిక సంఘాలు పెద్ద ఎత్తుమ రోడ్డెక్కాయి. ఏపీ సర్కార్ చేతగానితనం వల్లే స్టీల్ ప్లాంట్ అమ్మకంపై కేంద్రం దూకుడుగా వెళుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్, అనుబంధ సంస్థలన్నింటినీ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుండటంతో సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రజలను మభ్యపెట్టడానికే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు జగన్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.'ఫేక్ సీఎం వైఎస్ జగన్ గారూ! విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ మీరు చేసిన అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో తేలిపోయింది' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. 'ఇప్పటికైనా జగన్నాటకాలు ఆపి, ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణని ఆపే ప్రయత్నాలు చేయండి. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు' అని లోకేశ్ చెప్పారు. 'మీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్రయోజనాల పరిరక్షణకి పోరాడాలని ఆదేశాలివ్వండి' అంటూ లోకేశ్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై అనుమానాలున్నాయిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో దక్షిణ కొరియాకు చెందిన ఫోక్సో కంపెనీకి కట్టబెట్టి వాటాలు దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాల్లో భాగంగానే ఈ మౌనం అనిపిస్తోందని చెప్పారు. దీనిపై ఆయన లేఖ విడుదల చేశారు. జేబులు నింపుకోవడం కోసం జాతికి ద్రోహం చేసేందుకు జగన్ రెడ్డి సిద్ధపడడం సిగ్గుచేటు. విశాఖ ఉక్కుపై ఆధారపడి లక్షలాది మంది బతుకుతుంటే.. జగన్ రెడ్డికి కనిపించడం లేదా.? 150 రోజులుగా స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు చేస్తున్న ఉద్యమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు.? కమిషన్లు అందితే చాలు.. కన్న తల్లిని కూడా అమ్ముకుంటామనేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే దాదాపు 126 శాతం అధికంగా టర్నోవర్ సాధించిన విశాఖ స్టీల్ ను అమ్మేస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు మిన్నకుండిపోయారు.? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కు అనే పోరాటంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ జగన్ రెడ్డి మౌనం ఎందుకు.? జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. రాష్ట్ర ఆస్తులు అమ్మకానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు.. జాతి సంపదైన విశాఖ స్టీల్ వంటి ప్రఖ్యాత కంపెనీలను కూడా అమ్ముకోవడానికి సిద్ధపడడం ప్రజలకు ద్రోహం చేయడమే. ఫోక్సోతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను వెంటనే బయటపెట్టాలి. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకించిందో.. అందుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఎందుకు బయటపెట్టడం లేదు.? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. మోసపూరిత ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో హోరెత్తించే ప్రసంగాలు దంచి, కేంద్రం మెడలు వంచేస్తామని హడావుడి చేసిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. కేంద్రం వద్ద మోకరిల్లడం తప్ప చేసిందేమీలేదు. ఉద్యమ స్పూర్తితో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ విషయంలో కమిషన్ల కక్కుర్తి, దోచుకోవాలన్న ఆలోచన మాని.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పోరాడాలి. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ లేఖలు రాయడం ఆపి.. ఇకనైనా ఎదురు తిరగాలి. ఆంధ్రుల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరమైతే.. తెలుగు జాతి ప్రాణం పోయినట్లేనని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని అచ్చెన్నాయుడు తన లేఖలో హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/vizag-steel-plant-sale-tdp-leaders-target-cm-jagan-39-119119.html





