జగన్ మెప్పు కోసం మతాల మార్పిడి.. విజయసాయిరెడ్డి సంచలనం.!
Publish Date:Sep 16, 2026
Advertisement
జగన్ హయాంలో లవ్ జిహాద్ లు, మతమార్పిడులు జరిగాయని గతంలో ఆరోపించిన విజయసాయిరెడ్డి తాజాగా జగన్ హయాంలో ఆయన మెప్పు పొందడం కోసం పెద్ద ఎత్తున బలవంతపు మతమార్పిళ్లకు వైసీపీయులు పాల్పడ్డారని మరో బాంబు పేల్చారు. వైసీపీలో గతంలో నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన విజయసాయి, ఆ పార్టీ తరఫున రెండు సార్లు రాజ్యసభకు వెళ్లారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ మాజీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. మత మార్పిడి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారానికి దారితీశాయి. తాజాగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టులో జగన్ విధానాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జగన్ హయాంలో రాష్ట్రంలో మత మార్పిడిలను ప్రోత్సహించారన్న కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వేదికలపైనా కూడా హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం పాటు వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, మరీ ముఖ్యంగా జగన్ సన్నిహితుడిగా, వైసీపీలో కీలక పదవులు నిర్వహించిన వ్యక్తిగా విజయసాయి నుంచి వచ్చిన వ్యాఖ్యలు వైసీపీని డిఫెన్స్ లో పడేశాయి. వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు రాజకీయ సలహాదారుగా, కుడి భుజంగా మెలిగిన విజయసాయి జగన్ అధికారంలో ఉండగా మతమార్పిళ్లు జరిగాయని చేసిన వ్యాఖ్యలను చాలా మంది నమ్ముతున్నారు. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడి విజయసాయి వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమేనంటూ ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవన్న సజ్జల. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని, ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా, లేదా ఒక మతాన్ని బలవంతంగా ప్రోత్సహించే విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారంలో లేని సమయంలోనూ కూడా జగన్ అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను కాపాడే చర్యలు తీసుకున్నారన్నారు. విజయసాయి రెడ్డి వైసీపీని వీడి చాలా కాలం గడిచిపోయిందని, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లారన్న ఆయన.. విజయసాయి పార్టీని వీడినప్పుడు ఆయనపై జగన్ ఎటువంటి విమర్శలూ చేయలేదని గుర్తు చేశారు. విజయసాయి మాటలు పట్టించుకోనవసరం లేదు కానీ, ఇప్పుడు మత మార్పిడులపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై మౌనంగా ఉంటే.. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నానన్నారు. దశాబ్దాలుగా జగన్ కుటుంబంతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మొత్తంగా స్థానిక ఎన్నికల ముంగిట విజయసాయి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద మైనస్ అవుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వినా ఆయన కుటుంబం నుంచి ఎవరూ కూడా ఇంత వరకూ తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరు కాకపోవడం, జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం వంటి విషయాలను గుర్తు చేస్తున్నారు. మొత్తంగా జగన్ హయాంలో బలవంతపు మతమార్పిళ్లు అన్న విజయసాయి వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద శరాఘాతంగా మారతాయనడంలో సందేహం లేదని అంటున్నారు. [Vijayasai Reddy, YS Jagan Mohan Reddy, YSRCP, Sajjala Ramakrishna Reddy, Andhra Pradesh Politics,Telugu One]
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-25-231617.html




