కోలీవుడ్ దళపతి.. తమిళనాడు అధిపతి.. సీఎంగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం
Publish Date:May 9, 2026
Advertisement
కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీరూ ) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం ( మే 10) ఉదయం 10 గంటలకు ఆయన తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అటు అభిమానులు, ఇటు రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఆయన తండ్రి.. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి ఘనవిజయంపై స్పందిస్తూ.. . ఒక తండ్రిగా తాను ఏం చేసినా అది తన కుమారుడి శ్రేయస్సు కోసమేనని, ఈ రోజు విజయ్ సాధించిన విజయం నిజానికి తమిళ ప్రజల విజయమని ఆయన కొనియాడారు. ఇదే క్రమంలో కాబోయే ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిర్ణయం తమిళ ప్రజల సంక్షేమం కోసమే ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. కేవలం అధికారం కోసమే కాకుండా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సినిమా రంగంలో అగ్రనటుడిగా వెలుగొందిన విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ అత్యున్నత పదవిని చేపట్టడం తమిళనాడు చరిత్రలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్న విజయ్, ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ విధంగా ముందుకు సాగుతారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అంతకు ముందు అంటే శనివారం (మే 9) సాయంత్రం టీవీకే అధినేత విజయ్ తనకు మద్దతు ఇచ్చే పార్టీల సమ్మతి లేఖలతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు. . అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో విజయ్ ఆదివారం (మే 10) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
http://www.teluguone.com/news/content/tvk-vijay-swornin-tamilnadu-cm-25-219355.html





