చాట్ జీపీటీ ద్వారా ట్రాన్సఫర్ ఆర్డర్.. ఉద్యోగినిని మోసం చేసిన కేటుగాళ్లు
Publish Date:May 1, 2026
Advertisement
సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, దానిని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య అంతకు మించిన వేగంతో పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది.ఏఐ సాధనమైన చాట్ జీపీటీని ఉపయోగించి ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులను సృష్టించి, ఒక ఉద్యోగిని మోసం చేసిన ఉదంతం సంచలనం రేపింది. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ మోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన రమణమ్మ కడప జిల్లా గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇంటికి దూరంగా పని చేయడం ఇబ్బందిగా మారడంతో.. ఆమె తన స్వగ్రామానికి సమీపంలోని తనకల్లుకు బదిలీ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె భర్త జయచంద్ర తనకు తెలిసిన పలక వేణు అనే వ్యక్తిని సంప్రదించారు. దీనిని అవకాశంగా తీసుకున్న వేణు.. తన కుమారుడు గంగాద్రితో కలిసి రమణమ్మను మోసం చేసేందుకు భారీ స్కెచ్ వేశారు. నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు. చూడటానికి అసలైన ప్రభుత్వ ఆర్డర్ లాగే ఉన్న ఆ నకిలీ కాపీని జయచంద్రకు అందజేసి.. అతడి నుంచి భారీగా సొమ్ములాగేందుకు ప్రయత్నించారు. ఒక ఆ నకిలీ ఉత్తర్వులను పట్టుకుని రమణమ్మ తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో చేరేందుకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది. అక్కడ ఉన్న వైద్యాధికారులు ఆ ఉత్తర్వులను పరిశీలించి, అవి శాఖాపరంగా జారీ చేసినవి కావని తేల్చారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, చాట్ జీపీటీ ద్వారా ఈ నకిలీ కాపీని సృష్టించినట్లు నిర్ధారించి నిందితులు వేణు, గంగాద్రిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతోంది. బదిలీలు లేదా ఇతర అధికారిక పనుల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దనీ.. కేవలం అధికారిక వెబ్‌సైట్లు లేదా ఉన్నతాధికారుల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/transfer-orderusing-chatgpt-36-218696.html





