అంచనాలకు అందని ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎంపిక
Publish Date:Jun 30, 2025

Advertisement
బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపికలో ఈ విషయం మరోసారి ప్రస్ఫుటమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచంద్రరావును పార్టీ ఎంపిక చేసింది. ఈ రెండు స్థానాల కోసం అనేకమంది పోటీలో ఉన్నప్పటికీ, ఆరెస్సెస్ అండదండలు ఉన్నవారికి, పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగినవారికి, సౌమ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్ష పదవి కోసం విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాశ్, డాక్టర్ పీవీ పార్థసారథి, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. అయితే, పార్టీ హైకమాండ్ పీవీఎన్ మాధవ్‌ను ఎంపిక చేసింది. ఆరెస్సెస్‌తో సంబంధాలు మాధవ్ ఎంపికకు బలమైన కారణం అయ్యాయి. పైగా ఆయన రెండోతరం బీజేపీ నాయకుడు. ఆయన తండ్రి పీవీ చలపతి రావు బీజేపీ సీనియర్ నేత. గతంలో ఆరేళ్లపాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాధవ్ బీసీ నేత కావడం కూడా ఆయనను ఏపీ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపిక చేయడానికి మరో కారణం. అన్నిటికీ మించి సౌమ్యుడు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ పార్టీలతో కూడా సమన్వయం చాలా అవసరం. ఆ కారణంగానే బీజేపీ అధిష్ఠానం మాధవ్ కు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఎం. రఘునందన్ రావు వంటి పలువురు నాయకులు పోటీలో ఉన్నారు. అయితే, పార్టీ ఎన్. రామచంద్ర రావును ఎంపిక చేసింది. రామచంద్ర రావు ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన నాయకుడు. ఆయన ఎబివిపిలో చురుకైన పాత్ర పోషించారు. బీజేపీలో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన ఉంది. పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా సౌమ్యుడు. అందరినీ కలుపుకు పోగలరు.
http://www.teluguone.com/news/content/the-selection-of-ap-and-telangana-bjp-presidents--beyond-expectations-39-200960.html












