తెలంగాణలో జనసేనతో పొత్తుకు బీజేపీ నో.!
Publish Date:Aug 8, 2026
Advertisement
జనసేన పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీతో తెలంగాణలో పొత్తు ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టింది. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ లోనూ, జాతీయ స్థాయిలోనూ పొత్తు యథాతథంగా ఉంటుంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ కూటమి కేవలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు మాత్రమే పరిమితమని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పొత్తు ప్రశక్తే లేదనీ బీజేపీ విస్పష్టంగా తేల్చేసింది. తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాలని సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతో పవన్ కళ్యాణ్‌కు సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతాయని పరిశీలకులు భావించారు. అయితే.. తెలంగాణ బీజేపీ నాయకత్వం మాత్రం ఈ అంచనాలను తలకిందులు స్వతంత్రంగానే ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటించింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో బీజేపీకి సుదీర్ఘకాలంగా బలమైన ఓటు బ్యాంక్, క్షేత్రస్థాయి కార్యకర్తల నెట్వర్క్ ఉంది. దీంతో సొంతంగానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. అందుకే తెలంగాణ పరిధిలో ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో జనసేన పార్టీకి గతంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో జనసేన పరిమిత స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, చెప్పుకోదగ్గ విజయాలను నమోదు చేయలేకపోయింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ పొత్తుకు నో చెప్పడంతో తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీకి దిగుతుందా లేదా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. Telangana BJP, Jana Sena Party, Pawan Kalyan, GHMC Elections, BJP Alliance Telangana, Telangana Politics
http://www.teluguone.com/news/content/telangana-bjp-25-228369.html





