తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి
Publish Date:Apr 29, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు తెరపడింది. ఎంతోకాలంగా వేచి చూస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ అధికారులు ఇవాళ అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, తమ ప్రతిభను చాటుకున్నారు. సీనియర్ నేత కే. కేశవరావు చేతుల మీదుగా విడుదలైన ఈ ఫలితాల్లో, బాలికలు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైంది. గణాంకాలను పరిశీలిస్తే, బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 94.07 శాతంతో సరిపెట్టుకున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాల వారీగా విశ్లేషిస్తే, ములుగు జిల్లా అత్యుత్తమ ఫలితాలతో 99.30 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ జిల్లా 89.23 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది. విద్యాశాఖ ఈసారి విధానపరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు చేపట్టింది. గతంలో గ్రేడ్ల పద్ధతిని అనుసరించగా, ఈ ఏడాది నుండి నేరుగా సబ్జెక్టుల వారీగా మార్కులను కేటాయించడం జరిగింది. ఇది విద్యార్థులకు, ఉన్నత చదువుల ప్రవేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 99.10 శాతం ఉత్తీర్ణత సాధించి తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. మాధ్యమాల వారీగా చూస్తే, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 95.86 శాతంతో ముందుండగా, తెలుగు, ఉర్దూ మాధ్యమాల విద్యార్థులు కూడా ఆశించిన మేర ఫలితాలు సాధించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఫలితాలు చూసుకునే సదుపాయం కల్పించారు. 80969 58096 అనే నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా ఫలితాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎంతో ఊరట లభించింది. ఫలితాల పట్ల అసంతృప్తిగా ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం రేపటి నుండి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 14వ తేదీని ఫీజు చెల్లింపునకు తుది గడువుగా నిర్ణయించారు. ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం పట్ల విద్యార్థి లోకంలో ఆనందం వ్యక్తమవుతోంది.
http://www.teluguone.com/news/content/telangana-10th-results-36-218545.html





