కడప గడపలో ఎదురొడ్డిన నిలిచిన పసుపు జెండా
Publish Date:May 26, 2025
.webp)
Advertisement
43 ఏళ్ళ ప్రస్థానానికి జనం అండ
సీమ దత్త పుత్రుడు గా ఎన్టీఆర్ చిరస్మరణీయుడు
చంద్రబాబు నేతృత్వంలోనూ ఆయన వెంటే కడప జనం.
మరోత్సాహంతో కడపలో తెలుగుదేశం మహానాడు.
కడపలో మూడు రోజుల పాటు పసుపు పండగ
సీమ నడిబొడ్డు కడప గడ్డన ఎదురొడ్డి పోరాడిన తెలుగుదేశం పార్టీకి ఆపార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా కడప జనం అండగా నిలిచారు. జెండా ఎత్తి పోరు సాగించారు. జిల్లా రాజకీయాల్లో అప్పట్లో కాంగ్రెస్ నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ప్రాబల్యం నడుస్తూ వచ్చినా తెలుగుదేశం పార్టీ మొక్క వోని విశ్వాసంతో ముందుకు సాగింది. పడుతూ లేస్తూ వచ్చి హీరోలా నిలిచింది. ప్రజాబలమే కొండంత అండగా 43 ఏళ్ల ప్రస్థానం సాగించిన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో కార్యకర్తలే పట్టు సడలకుండా జెండా ఎగరేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల దాకా పదిసార్లు ఎన్నికలు జరిగితే ఇందులో ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ నే పైచేయి సాధించి విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు పగ్గాలు పట్టిన తరువాతా పార్టీకి కడప ఎప్పటిలాగే వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత 1999 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జిల్లాలో హవా కొనసాగించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాలు గెలుచుకొని ఉమ్మడి కడపలో తన సత్తా ఏంటో చాటింది . వైయస్ రాజశేఖరరెడ్డి , వైయస్ జగన్మోహన్ రెడ్డి లు సొంత గడ్డపై ఎదురొడ్డి పోరాడుతూ పార్టీ కార్యకర్తలు, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు కడప జిల్లాలో జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలలో ఉత్సహాన్ని నింపింది.
జీరో నుంచి హీరోగా
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన పట్టు సాగిస్తూ వచ్చినా 2004 నుంచి 2019 ఎన్నికల వరకు పార్టీ ఫలితాలు తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. 2019 ఎన్నికల్లో అటు పార్లమెంటు గాని ఇటు అసెంబ్లీలో గాని ఒక్క సీటు కూడా రాకుండా జీరో స్థాయికి ఫలితాలు పడిపోయాయి.అయినా కార్యకర్తలు, పార్టీ ఏ మాత్రం విశ్వాసం కోల్పోకుండా పని చేయడం జరిగింది . గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జీరో పలితాలు నుంచి హీరోగా ఎగిరింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో ఏడు స్థానాల్లో కూటమి జయకేతనం ఎగురవేసింది. వాటిలో ఐ దు స్థానాలలో తెలుగుదేశం జయభేరి మోగించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది . ఈ ఫలితాలతో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక ఫలితాలను భవిష్యత్తులోనూ సాధించాలన్న పట్టుదలతో కడపలో మహానాడును తలపెట్టి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వై సిపి పట్టును సడలించే ప్రణాళిక తో మహానాడు మహానాడు జరుపుకుంటోంది.
1983 నుంచి 2024 దాకా
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 1983 నుంచి 2024 వరకు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలాన్ని, గెలుపు ఓటములను పరిశీలిస్తే.. ఇప్పటివరకు పదిసార్లు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. డీలిమిటేషన్ కు ముందు 11 అసెంబ్లీ స్థానాల్లో 1983లో మొత్తం 6 స్థానాలు గెలుచుకుంది. 1985లో జరిగిన ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోగా 1989లో 2 స్థానాలకే పరిమితమైంది. 1994 లో తిరిగి పైకి లేచి 8 స్థానాలు గెలుచుకుంది. 1999లో తొమ్మిది స్థానాలు సొంతం చేసుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగించడంతో టిడిపి కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతూ వచ్చింది .2009 ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయింది .డీ లిమిటేషన జరిగి 10 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన ఉమ్మడి జిల్లాలో 2014 లో కూడా ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితం కాగా 2019లో ఒక్క అసెంబ్లీ స్థానం కానీ ,ఒక్క పార్లమెంటు స్థానం గాని గెలుచుకొని దుస్థితిలోకి పార్టీ వెళ్లిపోయింది. ఆ తర్వాత జిల్లాలో పార్టీ కోలుకోవడం కష్టమే అనుకుంటూ వచ్చినా టిడిపి మాత్రం జగన్ సొంత జిల్లాలోనే వైసీపీకి గట్టి దెబ్బ కొట్టి కూటమితో కలిసి ఎన్నికల్లో దిగి పార్టీ పరంగా ఐదు కూటమి పరంగా ఏడు స్థానాలు సాధించింది .దీంతో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ,బద్వేలు, రాజంపేటలో మాత్రమే వైసిపి అభ్యర్థులు గెలిచారు .ఈ ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న టీడీపీ శ్రేణులలో జోష్ ను మరింత పెంచేందుకు మహానాడుకు కడప వేదికైంది.
కంచు కోటలా ఆ రెండు స్థానాలూ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కంచు కోటల్లా మారాయి 1983 నుంచి 1999 దాకా జమ్మలమడుగు, రైల్వే కోడూరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలను సాధించిపెట్టాయి. అయితే 2004, 2009, 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. అయితే 2024 ఎన్నికలలో మళ్లీ ఇక్కడ జెండా ఎగురేసింది. కాకపోతే తెలుగుదేశం కంచు కోటలైన జమ్మలమడుగు లో బిజెపి , రైల్వే కోడూరులో జనసేన గెలవడం జరిగింది.
సీమ దత్త పుత్రుడు గా ఎన్టీఆర్
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు రాయలసీమ దత్తపుత్రుడుగా పేరుగాంచారు . ఆయనకు రాయలసీమ ప్రజలు నీరాజనాలు పట్టారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడపలో చారిత్రాత్మకమైన అభివృద్ధి జరిగింది. ముద్దనూరు దగ్గర రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించారు. నందలూరు దగ్గర వందలాది మందికి ఉపాధి కల్పించే ఆల్విన్ ఫ్యాక్టరీని ఆయన హయాంలోనే నిర్మించారు. ఇవే కాదు తెలుగు గంగ ప్రాజెక్టుకు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గాలేరు -నగరికి రూపకల్పన చేసి ప్రకటించారు. ఇలా రాయలసీమకు చారిత్రాత్మకమైన సీమ కడగండ్లు తీర్చే అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. అంతేకాదు రాయల సీమలోని అనంతరం జిల్లా హిందూపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి గా ప్రాతినిధ్యం వహించారు.
ఒంటిమిట్టకు వెలుగు తెచ్చిన చంద్రబాబు
జిల్లాలో చారిత్రక పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విలువ తీసుకొచ్చారు. రాష్ట్రం విడిపోయాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టలో జరిపే లాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేవారు. రాష్ట్రం విడిపోయాక ఒంటిమిట్ట కు ఆ భాగ్యం దక్కింది. ప్రాజెక్టుల పరంగా చూస్తే గాలేరు-నగరి మొదటి దిశలో మిగిలి ఉన్న పనులను 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు దాదాపు పూర్తి చేశారు. ముస్లిం మైనార్టీల కోసం కడప సమీపంలో హజ్ హౌస్ ను నిర్మించారు. కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినప్పటికీ ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కొనసాగ లేకపోయింది .ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్న ఎన్టీ రామారావు ,చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
http://www.teluguone.com/news/content/tdp-flag-in-kadapa-25-198741.html












