రాహుల్ తో భేటీ: మోడీతో మెట్రో ప్రయాణం: మాస్టర్ ప్లానా.. రెండు పడవల ప్రయాణమా.?
Publish Date:Oct 12, 2026
Advertisement
తమిళనాడు రాజకీయాలలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వరుస రోజుల్లో చోటుచేసుకున్న ఈ రెండు కీలక పరిణామాలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలకు దారితీస్తాయనే అంశంపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో చెన్నైలో జరిగిన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నివాసంలో సమావేశమై సుమారు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి ఒక కేఫ్‌కు వెళ్లి అల్పాహారం తిని, కాఫీ తాగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ సమావేశంలో వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటన్నది పూర్తిగా వెల్లడి కాలేదు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే చెన్నైలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నై పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూనమల్లి-వడపలని మెట్రో మార్గాన్ని ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రధానితో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. దాదాపు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలిసి కనిపించడం ప్రభుత్వ పరమైన సమన్వయంలో భాగమని పరిశీలకులు భావిస్తున్నారు. రాహుల్‌తో రాజకీయ చర్చలు జరిపిన మరుసటి రోజే ప్రధాని మోదీతో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం విజయ్ అనుసరిస్తున్న విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది. కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న విజయ్ పార్టీ తಮಿళ వెట్రి కజగం భవిష్యత్తులో ఏ రాజకీయ కూటమితో నడుస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. కేవలం ఒక సమావేశం ఆధారంగా భవిష్యత్ రాజకీయ నిర్ణయాలను అంచనా వేయడం సాధ్యం కాదంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ఎంత ముఖ్యమో, రాజకీయంగా స్వతంత్ర వైఖరిని ప్రదర్శించడం కూడా అంతే కీలకమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు కేంద్రంతో సహకరిస్తూనే, విధానపరమైన అంశాలపై తమ స్వరాన్ని వినిపించే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ సమక్షంలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులపై విజయ్ గళమొత్తడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, రాహుల్ గాంధీతో స్నేహపూర్వక భేటీ, ప్రధాని మోదీతో మెట్రో ప్రయాణం వంటి పరిణామాలు విజయ్ మాస్టర్ ప్లాన్‌లో భాగమని భావించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర మరింత కీలకం కానున్న తరుణంలో, విజయ్ అనుసరిస్తున్న వ్యూహం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌తో రాజకీయ సహకారం వైపు అడుగులు వేస్తారా లేక అన్ని పార్టీలతోనూ సమదూరం పాటిస్తూ స్వతంత్ర రాజకీయాలను కొనసాగిస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. [Tamil Nadu Chief Minister Vijay Master Plan, Rahul Gandhi Meeting, Narendra Modi Metro Travel, Tamilaga Vettri Kazhagam, Chennai Metro, Telugu One]
http://www.teluguone.com/news/content/tamil-nadu-chief-minister-vijay-master-plan-25-234180.html




