వెండితెరకెక్కనున్న దార్శనికుడి కథ.. చంద్రబాబు బయోపిక్‌కు రంగం సిద్ధం!
Publish Date:Apr 22, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన అగ్రనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆయన ప్రయాణాన్ని బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రాజధాని ఫైల్స్ వంటి సెన్సేషనల్ మూవీతో అమరావతి రైతుల ఆవేదనను, రాజధాని ఆవశ్యకతను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు భాను చంద్రబాబు బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాయి. చంద్రబాబు నాయుడు జీవితంలోని కీలక ఘట్టాలను, ఆయన సాగించిన పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు భాను సిద్ధమవుతున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్థానం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమని చంద్రబాబు బయోపిక్ దర్శకుడు భాను పేర్కొన్నారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ప్రజాక్షేమం, ప్రతి ఆలోచన వెనుక భావితరాల భవిష్యత్తు ఉంటుందన్న ఆయన.. నిత్యకృషివలుడైన నాయకుడి జీవితంలో ఉండే ఉద్వేగాలు, సంఘర్షణలు, విజయాలను ఈ బయోపిక్ ద్వారా ప్రపం కళ్లకు కట్టనున్నట్లు చెప్పారు. నిఘంటువులోని ప్రతి పదానికి అర్థం ఉన్నట్లే, ఆయన వేసిన ప్రతి అడుగులో ఒక గొప్ప చరిత్ర ఉందని భాను అన్నారు. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా పాన్ వరల్డ్' రేంజ్ లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివిధ దేశాల్లోనూ చంద్రబాబుకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ముఖ్యంగా విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేసే యోచనలో ఉన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ మూవీని తీర్చిదిద్దాలని చిత్ర బృందం కంకణం కట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. భారీ తారాగణంతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారు. చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. రాజకీయ బయోపిక్‌లు టాలీవుడ్‌లో కొత్త కాకపోయినా, చంద్రబాబు వంటి సమకాలీన రాజకీయ దిగ్గజం కథను భాను వంటి దర్శకుడు హ్యాండిల్ చేయడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. రాజధాని ఫైల్స్ చిత్రంలో అమరాతి రైతుల బాధలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన దర్శకుడు భాను.. చంద్రబాబు బయోపిక్ ను మరింత ప్రతిభావంతంగా, ప్రభావమంతంగా చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు బయోపిక్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
http://www.teluguone.com/news/content/stage--set-for-chandrababu-biopic-36-217959.html





