బాబ్ ఎల్ మాండెబ్ జలసంధినీ స్వాధీనం చేసుకుంటాం.. ఇరాన్ హెచ్చరిక!
Publish Date:Jun 2, 2026
Advertisement
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాలపై ఇరాన్ తన పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ముడి చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం వాటా రవాణా అయ్యే హార్ముజ్ జలసంధి పై ఆంక్షలు విధించి అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెట్టిన ఇరాన్, ఇప్పుడు మరో కీలకమైన సముద్ర మార్గాన్ని దిగ్బంధిస్తామంటూ హెచ్చరించింది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని తమ అధీనంలోకి తీసుకుంటామని, ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ఇరాన్, హౌతీ తిరుగుబాటుదారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను స్తంభిం పజేయడమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చోవడానికి కారణం కానుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో ఈ రెండు జలసంధులు అత్యంత కీలకమైన చోక్ పాయింట్లు. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ చమురు బారెళ్లు రవాణా అవుతుండగా, బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రంతోనూ, తద్వారా సుయెజ్ కాలువ మార్గంలో ఐరోపా దేశాలతోనూ అనుసంధానిస్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ రెండు మార్గాలను అడ్డుకుంటే, ఆసియా, ఐరోపా దేశాల మధ్య ప్రయాణించే సరుకు రవాణా నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ వేల కిలోమీటర్ల అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడమే కాకుండా, డెలివరీ సమయం చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఇది ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రపంచ దేశాలకు పెద్ద దెబ్బగా పరిణమించే ముప్పు ఉంది. అమెరికా సైనిక బలగాలు, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సముద్ర మార్గాల రక్షణ కోసం రంగంలోకి దిగినప్పటికీ, ఉద్రిక్తతలు తగ్గడం లేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ నివేదికల ప్రకారం, సముద్ర దిగ్బంధం కారణంగా ఇరాన్ విక్రయించలేకపోయిన దాదాపు 41 ట్యాంకర్లలోని 69 మిలియన్ బారెళ్ల చమురు నిలిచిపోయింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చి, హౌతీల సహాయంతో బాబ్ ఎల్-మాండెబ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. సముద్ర రవాణా మార్గాల్లో నౌకల భద్రతకు విఘాతం కలిగించేలా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్, సైనిక ఘర్షణలు ఎప్పుడు ఎలాంటి భీకర యుద్ధానికి దారితీస్తాయోనని గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/seize-the-bab-elmandeb-strait-36-221483.html





