వంశీ కనుసన్నలలోనే సత్యవర్థన్ కిడ్నాప్.. పోలీసుల వద్ద పక్కా ఆధారాలు?!
Publish Date:Feb 17, 2025
Advertisement
వంశీ కనుసన్నలలోనే టీడీపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ జరిగిందనడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారా? ఆయన కిడ్నాప్ నకు సంబంధించి సీసీ ఫుటేజీల ఆధారంగా వంశీ ప్రమేయాన్ని నిర్థారించుకున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఇప్పటికే పోలీసులు సత్యవర్థన్ ను రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసానికి తీసుకువెళ్లన సంఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని సేకరించారని చెబుతున్నారు. రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసం నుంచి సత్యవర్థన్ ను విశాఖ తరలించడం, అక్కడ నుంచి విజయవాడ కోర్టుకు తీసుకురావడం వరకూ పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉందని అంటున్నారు. వంశీ అనుచరులు సత్యవర్థన్ ను విశాఖ నుంచి విజయవాడ కోర్టుకు తీసుకురావడం, సత్యవర్థన్ కారు దిగి కోర్టులోకి వెళ్లి.. తిరిగి రావడం, అతడు వచ్చే వరకూ కోర్టు ఆవరణలోనే వంశీ అనుచరులు వేచి ఉండటానికి సంబంధించి సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని వంశీ ప్రమేయానికి సంబంధించిన లింకుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వల్లభనేని వంశీని అరెస్టు చేసినప్పటికీ అతడి ఫోన్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. అటు రాయదుర్గంలోని వంశీ నివాసంలోనూ, ఇటు వంశీ వద్దా ఆ ఫోన్ లేదు. రాయదుర్గంలోని వంశీ నివాసం నుంచి అతడిని అదుపులోనికి తీసుకోవడానికి ముందు వంశీ ఫోన్ లో చాలా సేపు మాట్లాడారు. ఆ తరువాత ఆ ఫోన్ మాయం అయ్యింది. దీంతో ఈ కేసులో అత్యంత కీలకమైన రంగా, కొట్లు, రాము అనే వ్యక్తుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. మరీ ముఖ్యంగా రంగా, కొట్లు, రాము అనే వ్యక్తులను దొరకబుచ్చుకంటే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వీళ్లందరి ఫోన్లూ స్విచ్ఛఫ్ అయ్యి ఉండటంతో.. పోలీసులు వారి బంధువులు, స్నేహితులకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టారు. ఇలా ఉండగా సత్యవర్థన్ తన కిడ్నాప్ నకు సంబంధించి ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్లు పోలీసులు వివరించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. అన్ని విషయాలనూ శాస్త్రీయంగా విశ్లేషించి, పక్కా ఆధారాలతోనే వంశీని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/satyavardhan-kidnap-police-have-evidence-of-vallabhaneni-vamshi-link-39-193003.html





