ఉద్ధవ్ శివసేనలో తిరుగుబటు?
Publish Date:Jun 17, 2026
Advertisement
మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గతంలో శివసేనను నిలువునా చీల్చిన ఏక్‌నాథ్ షిండే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన విభాగానికి మరో భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు షిండే నేతృత్వంలోని శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పరిణామాలు మరవకముందే.. ఇప్పుడు మహారాష్ట్రలో అదే తరహా రాజకీయ ప్రకంపనలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఉద్ధవ్ శివసేన హైకమాండ్ తమ పార్టీ లోక్‌సభ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పుడు వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలో ఆందోళన, అలజడి మొదలైంది. పరిస్థితి చేతులు దాటిపోకముందే అప్రమత్తమైన ఉద్ధవ్ ఠాక్రే, స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ మేరకు. శివసేన (ఉద్దవ్ ) పార్టీకి చెందిన ఆరుగురుర ఎంపీలు, ఇప్పుడు అధికార శివసేన వైపు చూస్తున్నారు. సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేశ్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వక్చౌరే, సంజయ్ జాధవ్ లు షిండే వర్గంతో నిరంతరం టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. వీరితో పాటు రాజాభౌ వాజే పేరు కూడా ఈ తిరుగుబాటు జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రేకు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నఎంపీలలో సగానికి పైగా బలం చేజారిపోయే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శివసేన (ఉద్దవ్) ఎంపీలు ఢిల్లీలో ఏక్‌నాథ్ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేయాలని వీరు స్పీకర్ ను కోరే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత చట్టబద్ధంగా షిండే నేతృత్వంలోని శివసేనలో ఈ గ్రూపును విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలని వ్యూహం పన్నినట్లు చెబుతున్నారు. మరోవైపు అ షిండే వర్గం ఈ పరిణామాలను బాహాటంగానే సమర్థిస్తోంది. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సార్నాయక్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దివంగత బాల్ ఠాక్రే ఆశయాలను, సిద్ధాంతాలను నిజాయితీగా నమ్మి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమర్థవంతమైన నాయకత్వంపై విశ్వాసం ఉంచే ఏ నాయకుడికైనా శివసేన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన అన్నారు. తిరుగుబాటు ఆలోచనతో వస్తున్న ఎంపీలను తాము సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన ప్రకటించడంతో విలీన ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అయితే.. ఎంపీ సంజయ్ రౌత్.. ఈ తిరుగుబాటు వార్తలన్నీ మైండ్ గేమ్‌లో భాగమేనని, తమ పార్టీ ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రే వెంటే నిలబడతారని స్పష్టం చేశారు. అదే సమయంలో అధికార పక్షంపై ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ ఏకంగా 15 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తున్నారని సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.
http://www.teluguone.com/news/content/revolt-within-uddhavs-shivsena-25-223178.html





