ఆపరేషన్ సింధూర్.. ఈ పేరు ఎందుకు పెట్టారంటే?
Publish Date:May 7, 2025
Advertisement
ఏప్రిల్ 22న పహెల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో.. ముష్కరులు ఒక పథకం పన్నారు. మన ఆడపడుచులను, వారి పిల్లల్ని వేరు చేసి.. వారి భర్తలను మతాన్ని అడిగి మరీ కాల్చి చంపారు. ఈ క్రమంలో హిమాన్షులాంటి ఎందరో ముత్తయిదువలు.. తమ నుదుటి సింధూరాన్ని కోల్పోయారు. మరీ ముఖ్యంగా హిమాన్షు అయితే పెళ్లి జరిగింది ఏప్రిల్ 19న, ఆమె తన భర్తను కోల్పోయింది ఏప్రిల్ 22న. పట్టుమని వారం కూడా నిలువని సింధూరం ఆమెది. ఆమె తన భర్త శవపేటిక ముందు కూర్చుని పదే పదే విలపించడం చూసి యావత్ భారత దేశం చలించి పోయింది . మరో బాధిత మహిళ తన భర్తను చంపిన ఆ ఉగ్రవాదితో.. తననూ తన కుమారుడ్ని కూడా చంపేయమని ప్రార్ధించగా.. మీ మోడీకి వెళ్లి చెప్పుకోమన్నాడా ముష్కరుడు. ఇలాంటి 26 మంది భారతీయ మహిళల సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రదాడి ఇది. దాడి జరగడాకి మూడు రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అసీం హిందూ భారత్ తో మనం పౌర యుద్ధం చేయాల్సి ఉందనడం.. వారెలా మన భారతీయత మీద దెబ్బ తీయాలనుకున్నారో స్పష్టం చేస్తుంది. అలా మన భారతీయ మహిళలు కోల్పోయిన ఐదవ తనానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టింది భారత సైన్యం. అంతే కాదు సింధూరం అంటే ఎర్రటి వర్ణం అని అర్ధం. ఒక రకంగా చెబితే ఎరుపు రంగు రక్తానికి చిహ్నం.. ఇక్కడ మన వారిని చంపి పచ్చటి పచ్చిక బైళ్లను రక్త సిక్తం చేసినందుకు గుర్తుగానూ.. సింధూర్ అన్న పేరు పెట్టి ఉంటుంది ఇండియన్ ఆర్మీ. మన వాళ్లు ఒక్కో ఆపరేషన్ కి ఒక్కో పేరు పెడుతుంటారు. గతంలో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి ఎన్నో నామకరణాలు చేసి ఉన్నారు. అందులో భాగంగా ఈ ఆపరేషన్ కి మాత్రం ఆపరేషన్ సింధూర్ అని పెట్టి.. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించారు. వీటి ద్వారా భారీ ఎత్తున ఉగ్రమూకలను, వారి వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ మన వాళ్లు పాటించిన మరో నియమం.. కేవలం ఉగ్ర స్థావరాలపై తప్ప.. పాక్ ప్రజలపై గానీ, వారి సైనిక స్థావరాలపై గానీ ఇండియన్ ఆర్మీ దాడులు చేయలేదు. ఆపరేషన్ సింధూర్ లో ఇది గుర్తించాల్సిన అంశం. అందుకే మన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత్ మాతాకీ జై అని ట్వీట్ చేశారు. మన ఆర్మీ న్యాయం జరిగిందని అనడంలోనూ అర్ధమిదే. మన ఆడపడుచుల సింధూరం అంటే నుదుట బొట్టు కోల్పోయేలా చేసిన వారి పీచమణిచాం అన్న అర్ధం ధ్వనించేలా వీరీ ప్రకటనలు వీరు చేసినట్టుగా భావిస్తున్నది సమస్త భారత ప్రజానీకం.
http://www.teluguone.com/news/content/reason-behind-naming-surgical-stike-as-operation-snfhoor-25-197602.html





