త్వరలో ఉత్తరాంధ్రలో రామోజీరావు విగ్రహ ప్రతిష్ఠాపన!
Publish Date:Jun 14, 2024
Advertisement
ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి దగ్గరకు వెళ్లి, రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ, తొలినాళ్లలో ఉత్తరాంధ్రలో విశాఖ తీరంలో ఈనాడు పత్రికను స్థాపించి.. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని రామోజీరావు గారు చైతన్యపరిచారని అన్నారు. ఈనాడు పత్రికలో ప్రజా సమస్యలను వార్తల రూపంలో ప్రచురించి, వాటిని పరిష్కరించే దిశగా వారధిలా రామోజీరావు పనిచేశారని తెలిపారు. దానికి కృతజ్ఞతగా ఉత్తరాంధ్రలో రామోజీరావు గారి నిలువెత్తు విగ్రహాన్ని మొదటగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని వెల్లడించారు. తెలుగుతనాన్ని, తెలుగు పౌరుషాన్ని, తెలుగు జాతిని కాపాడే దిశగా రామోజీరావు పత్రికలు, టీవీలు, ఫిలిం సిటీ, మార్గదర్శి సంస్థల ఏర్పాటుతోపాటు ఎంతోమంది కళాకారులని తీర్చిదిద్దారని అప్పలనాయుడు అన్నారు. రామోజీరావు గురించిన అంశాలు భావితరాలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా, రామోజీరావు ప్రతిబింబాన్ని బాహ్య ప్రపంచానికి కనిపించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తనకు క్రమశిక్షణ, బాధ్యతలు, సమాజంపై నమ్మకం ఈనాడు పత్రికలో పనిచేయడం వల్లనే తనకు అబ్బాయని అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతంలో రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. రెండో విగ్రహాన్ని రణస్థలంలోని సాయి డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రతిష్టించనున్నట్టు తెలిపారు.
http://www.teluguone.com/news/content/ramoji-rao-statue-in-kothapet-25-178677.html





