రాజ్యసభ ఎన్నికలు: సీనియర్లకు బీజేపీ షాక్.. కేంద్ర మంత్రలు సహా సిట్టింగ్ లకు నో చాన్స్.!
Publish Date:Oct 6, 2026
Advertisement
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుని సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా యూపీలో ఒక్కరంటే ఒక్క సట్టింగ్ రాజ్యసభ సభ్యుడికి కూడా టికెట్ ఇవ్వలేదు. పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రులతో ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీకి కూడా తిరిగి అవకాశం కల్పించకుండా, ఎనిమిది మంది కొత్త ముఖాలను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర కేబినెట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు కూడా రాజ్యసభ టికెట్ నిరాకరించడం సంచలనంా మారింది. యూపీ నుంచి ఖాళీ అవుతున్న పది రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం అధికార బీజేపీ సులభంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మిగిలిన రెండు స్థానాలను ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మ వంటి కేంద్ర మంత్రులకు చోటు దక్కలేదు. వీరు ఇద్దరూ గతంలో యూపీ కోటాలోనే రాజ్యసభ సభ్యులుగా సేవలందించినప్పటికీ, ఈసారి వారికి పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. పార్టీ విడుదల చేసిన కొత్త జాబితాలో ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోన్కర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్లను అభ్యర్థులుగా ఖరారు చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక ఉ:దని స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమించే సంస్థాగత కార్యకర్తలకు గుర్తింపునిచ్చేలా ఈ జాబితాను రూపొందించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వివిధ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో ముగ్గురు ఓబీసీ వర్గాలకు చెందిన వారు, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), మరో ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఉన్నారు. అంతేకాకుండా, సామాజిక సమతుల్యతను పాటిస్తూ ఇద్దరు మహిళా అభ్యర్థులకు కూడా స్థానం కల్పించడం విశేషం. బారాబంకి మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ తో పాటు ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శ్రుతి గంగ్వార్లను మహిళా కోటాలో బరిలోకి దించారు. ఇక ఇతర ప్రముఖులలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది. కింది స్థాయి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులను ఎగువసభకు పంపడం ద్వారా, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గతంలో ఎంపీలుగా కొనసాగిన ప్రముఖులను పక్కనపెట్టి మరీ కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో నాయకత్వ మార్పునకు పెద్దపీట వేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి యువత, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొనిపోయేలా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేయడంలో ఈ రాజ్యసభ ఎన్నికల ఎంపిక ఒక ముఖ్యమైన మెట్టుగా నిల వనుంది. సిట్టింగ్లను కాదని సరికొత్త బృందాన్ని ఎగువసభకు పంపడం ద్వారా పార్టీలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు, సమర్థులైన కొత్త నాయకులను జాతీయ స్థాయికి పరిచయం చేయాలనే ఉద్దేశం కూడా దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీనియర్ నాయకులను పక్కనపెట్టడంపై కొంతమేర అంతర్గత అసంతృప్తి వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల కోణంలో ఈ జాబితా పార్టీకి ఎన్నికల సమయంలో లబ్ధి చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అక్టోబర్ 16న జరగనున్న పోలింగ్ అనంతరం ఈ కొత్త అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా లేదా సులభంగానే రాజ్యసభకు ఎన్నికవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
[Rajya Sabha elections, BJP candidates, Uttar Pradesh politics, Union Ministers, UP Assembly elections, Telugu One]
http://www.teluguone.com/news/content/rajya-sabha-elections-25-233506.html




