రాజాసింగ్ రాజీనామా ఆమోదం... బీజేపీకీ మైనస్సే
Publish Date:Jul 12, 2025
.webp)
Advertisement
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఆ పార్టీతో పదేళ్ళ అనుబంధం ముగిసింది. ఈ పదేళ్ల కాలంలో రాజాసింగ్ తెలంగాణలో బీజేపీకి ఫేస్ గా ఎదిగారు. హిందుత్వకు రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణలో రాజాసింగ్ బీజేపీని మించి ఎదిగారు. ఆ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని నాయకులుగా గుర్తింపు పొందిన అందరి కంటే ఎక్కువ జనాదరణ పొందారు. ఇదే ఆయనను బీజేపీకి దూరం చేసింది. ఆ పార్టీ తలుపులు రాజాసింగ్ కు శాశ్వతంగా మూసుకుపోయేలా చేసిందా? అంటే రాజకీయ పరిశీలకుల నుంచీ, బీజేపీ శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానమే వస్తోంది. అయితే రాజాసింగ్ పార్టీలో ఇంతలా ఎదగడానికి కారణం ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే. స్వపక్షం, విపక్షం అని లేకుండా ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటమే అంటారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే రాష్ట్ర పార్టీలో సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిపై ఘాటు విమర్శలే చేశారు. ఇవన్నీ క్రమశిక్షణ గీత దాటడమేనని బీజేపీ అధిష్ఠానం భావించింది. ఈ క్రమంలో రాజాసింగ్ కు, పార్టీకీ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయినా రాజాసింగ్ రాజీనామా అంటే గతంలో కూడా పలుమార్లు ప్రకటించారు. అయితే అప్పడు ప్రతి సందర్భంలోనూ పార్టీ ఆయనను బుజ్జగించింది.
ఓ సారి సస్పెండ్ చేసి కూడా.. మళ్లీ ఆ సస్పెన్షన్ ను రద్దు చేసి మరీ గత ఎన్నికలలో పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. అందుకు కారణంగా రాష్ట్ర బీజేపీలో రాజాసింగ్ కు ఉన్న పాపులారిటీ మరో బీజేపీ నేతకు లేకపోవడమే. అయితే.. రాష్ట్రంలో పార్టీని మించి రాజాసింగ్ పాపులారిటీ పెరగడంతో ఇక ఆయనను భరించలేమన్న నిర్ణయానికి వచ్చేసిన హై కమాండ్ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించేసింది. ఇప్పుడు రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడింది. హిందుత్వ ముద్ర పడిన ఆయన మరో పార్టీలో చేరే అవకాశాలు దాదాపు మృగ్యం. మైనారిటీలను దూరం చేసుకోవడానికి బీజేపీ వినా మరో పార్టీ ధైర్యం చేసే పరిస్థితి తెలంగాణలో.. ఒక్క తెలంగాణ అనేమిటి? దేశంలో ఏ పార్టీకి లేదు. ఇక ఇప్పుడు ఆయన ముందు మిగిలినది ఒకే ఒక్క ఆప్షన్. స్వతంత్రంగా గోషామషల్ లో తన పాపులారిటీ పోకుండా కాపాడుకోవడం. అయితే అదేమంత సులువు కాదని పరిశీలకులు అంటున్నారు. అసలింతకీ బీజేపీ రాజాసింగ్ ను వదిలించేసుకోవడమే మేలన్న నిర్ణయానికి రావడానికి పలు కారణాలున్నా.. ప్రధానంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆయన అధిష్ఠానన్నే ప్రశ్నించేలా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలే అని చెప్పాలి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపినను వ్యతిరేకించిన రాజాసింగ్.. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తానంటూ ముందుకు వచ్చారు. అయితే కారణాలేమైనా ఆయన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. ఇందుకు తన మద్దతుదారులను బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బెదరించారని ఆరోపణలు చేశారు. అంతే కాదు.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ రాజీనామా చేసేశారు. సరిగ్గా ఇక్కడే బీజేపీ రాష్ట్ర నేతలు ఒక అవకాశం దొరికిందని భావించి రెండో ఆలోచన లేకుండా ఆయన రాజీనామాను హైకమాండ్ కు పంపేశారు. ఆయనను పార్టీ భరించలేదని నివేదిక కూడా ఇచ్చారని చెబుతారు. దీంతో పార్టీ హై కమాండ్ ఆయన రాజీనామాను ఆమోదించేసింది.
ఈ ఆమోదం రాజాసింగ్ కే కాదు, రాష్ట్రంలో బీజేపీకీ మైనస్సేనని పరిశీలకులు అంటున్నారు. అ గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించడం వల్ల ఎలా పార్టీ నష్టపోయిందో.. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా ఆమోదం వల్ల కూడా అంతటి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/rajasingh-resignation-acceptence-minus-to-bjp-39-201806.html












