తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు
Publish Date:Apr 30, 2026
Advertisement
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా.. వచ్చే మూడు రోజుల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. గురువారం (30-4-26) దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఫలితంగా.. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా పిడుగులతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో గంటకు 50- 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. బుధవారం నాటి ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. అంతర్గత మహారాష్ట్ర సహా దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఒక ప్రతిచక్రవాత వలయం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/rain-forecast-36-218671.html





