చర్చలు జరపండి.. ఇండియా, పాక్ ప్రధానులకు ప్రముఖుల లేఖ!
Publish Date:Jul 1, 2026
Advertisement
ఇండియా, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్యలను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలంటూ ఇరు దేశాలకూ చెందిన ప్రముఖులు ఒక బహిరంగ లేఖ రాశారు. ఇరు దేశాల ప్రధానులకూ రాసిన ఈ లేఖపై ఇరు దేశాలలోని వివిధ రంగాలకు చెందిన 117 మంది లబ్దప్రతిష్టులైన ప్రముఖులు ఒకే వేదికపైకి వచ్చి, ఇండియా, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలంటూ రాసిన ఆ లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌లకు ఏకకాలంలో పంపించారు. ఈ లేఖ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన అధికారిక, అనధికారిక దౌత్య మార్గాలను మళ్లీ తెరిచి, అన్ని సమస్యలపై ప్రత్యక్ష సంప్రదింపులకు తక్షణమే శ్రీకారం చుట్టాలని ఈ ప్రముఖులు ఆ లేఖలో ఇరు దేశాల ప్రముఖులకు విజ్ణప్తి చేశారు. సరిహద్దుల మధ్య వారధిగా నిలిచి నేతృత్వం వహిస్తున్న ఢిల్లీకి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ అధినేత ఓపీ షా ఈ ఇందుకు చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని, ఈ ప్రతిష్టంభన దక్షిణాసియా ఉపఖండంలోని సాధారణ ప్రజల దైనందిన జీవితాలపై, మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంత వాసులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నఓపీ షా , రెండు పొరుగు దేశాల మధ్య శాంతి, ప్రాంతీయ స్థిరత్వం, సాధారణ సత్సంబంధాలు నెలకొంటేనే కోట్లాది మంది ప్రజల ఆర్థిక శ్రేయస్సు, ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయన్నారు. గతంలో జరిగిన పాకిస్థాన్ ప్రేరేపిత ఘోర ఉగ్రదాడులైన 26/11 ముంబై దాడులు, పుల్వామా సైనిక కాన్వాయ్‌పై దాడి, మరియు పహల్గామ్ ఉగ్ర ఘటనల నేపథ్యంలో చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించగా, దానికి ఓపీ షా దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదం మరియు సరిహద్దు రక్షణ వంటి అత్యంత కఠినమైన సమస్యలను కూడా కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే శాశ్వతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాద మూలాలపై భారత్ అనుసరిస్తున్న అత్యంత కఠినమైన సైనిక, రక్షణ వ్యూహాలపై ఆయన స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ఎంతటి కఠినమైన చర్యలు చేపట్టినప్పటికీ, అంతిమంగా శాశ్వత శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఆయన చొరవతో దేశంలో పలు రంగాలకు చెందిన 117 మంది ఏకతాటిపైకి వచ్చి ఈ లేఖపై సంతకాలు చేయడానికి ముందుకు వచ్చారు. రెండు దేశాల మధ్య నిరంతరాయంగా చర్చలు జరగడం వల్ల మాత్రమే ఒకరి అంతర్గత ఆందోళనలు, భద్రతాపరమైన పరిమితులు మరియు అభ్యంతరాలను మరొకరు క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని, తద్వారా శాశ్వత శాంతికి బలమైన పునాది పడుతుందని ఈ 117 మంది ప్రముఖుల బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
http://www.teluguone.com/news/content/prominent-figures-write-to-indian-and-pakistani-prime-ministers-36-224811.html





