అందుబాటులోకి రోడ్ డాక్టర్ రోడ్లపై గుంతలు చిటికెలో మాయం!
Publish Date:Jun 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర రోడ్లపై గుంతలు, గతుకులకు పర్మనెంట్ గా చెక్ పెట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ రోడ్ డాక్టర్ అనే వినూత్న పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టింది. రోడ్లపై ఉండే గుంతలను వేగంగా, అత్యాధునిక సాంకేతికతతో పూడ్చేందుకు ఈ సరికొత్త విధానాన్నితీసుకువచ్చింది. సాధారణంగా ఏదైనా రోడ్డు పనులు జరగాలంటే నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది, కానీ ఈ రోడ్ డాక్టర్ విధానం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రాథమికంగా తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఎక్కడైనా రోడ్డుపై పెద్ద గుంతలు, అంటే ప్రయాణానికి ఇబ్బంది కలిగించే గతుకులు, గుంతలను గమనిస్తే, వెంటనే వాటి ఫోటోలను తీసి, పూర్తి సమాచారంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా సమాచారం అందిన వెంటనే, సంబంధిత రోడ్ డాక్టర్ ప్రత్యేక బృందానికి ఆటోమేటిక్‌గా అలర్ట్ వెళ్తుంది. సమాచారం అందిన గంటల వ్యవధిలోనే ఆధునిక మిషనరీతో కూడిన ప్రత్యేక వాహనం ఆ ప్రాంతానికి చేరుకుని, ఆ గుంతలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చి రోడ్డును మునుపటిలా మార్చేస్తుంది. ఎంతో ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ.. ప్రజల భద్రత, సౌకర్యం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వినూత్న ఆలోచనకు స్థానిక ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. కేవలం గంటల వ్యవధిలోనే రోడ్డు సమస్యలు పరిష్కారం కావడం పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో.. ఈ సేవలను త్వరలోనే రాష్ట్రంలోని మరో ఐదు జిల్లా కేంద్రాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత దశలవారీగా రోడ్ డాక్టర్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఏపీ రోడ్ల రూపురేకలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/potholes-on-roads-vanish-in-a-jiffy-36-222318.html





