మాజీ మంత్రి రోజాకు నోటీసులు.. అరెస్టే తరువాయా?
Publish Date:Jul 27, 2026
Advertisement
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి, ఆర్.కె. రోజా అరెస్టు కాక తప్పదా? తాజాగా పోలీసులు రోజాకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయవర్గాలలో రోజా అరెస్టు అవుతారా అన్న చర్చ జోరందుకుంది. ఒక పాత కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో ఈ నెల 30 న విచారణాధికారుల ఎదుట హాజరుకావాలని, లేనిపక్షంలో అరెస్ట్ చేస్తామనీ పేర్కన్నారని అంటున్నారు. రోజా ఇటీవల కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా ఉండటం లేదు. తాజాగా పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడానికి, వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో అప్పటి మంత్రి రోజాను ప్రశ్నించడం కోసం నోటీసులు జారీ చేశారు. ; పోలీసు నోటీసుల మేరకు రోజా ఈ నెల 30న విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకున్నా, విచారణలో అధికారులకు సహకరించకున్నా అరెస్టు తప్పదని ఆ నోటీసులలోనే పేర్కొన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మాజీ మంత్రి రోజా రాజకీయంగా పెద్దగా క్రీయాశీలంగా వ్యవహరించడం లేదు. కానీ గతంలో ఆమె విపక్షాలపై మీడియా సమావేశాల్లో, సభల్లో పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడేవారు. ఆ సందర్భంగా ఆమె అనుచిత భాషా ప్రయోగం చేసేవారన్న ఆరోపణలున్నాయి. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి, తాను కూడా స్వయంగా నగరి నుంచి పరాజయం పాలైన తరువాత నుంచి ఆమె మీడియా ముందుకు రావడం బాగా తగ్గించారు. పైగా ఎక్కువ సమయం తమిళనాడు రాజధాని చెన్నైకే పరమితమౌతూ వస్తున్నారు. ఒక సందర్భంలో ఆమె టీవీకేలో చేరేందుకు తెగ ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. సరే కేసుల భయతోనే రోజా రాజకీయంగా దూకుడు తగ్గించారని పరిశీలకులు విశ్లేషణనలు కూడా చేశారు. గత కొంత కాలంగా చెన్నైకే పరిమితమైన రోజా.. నగరి నియోజకవర్గానికి వచ్చిన రెండు రోజులలోనే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి మరీ నోటీసులు అందించారు. కాగా రోజాకు పోలీసులు అందజేసిన నోటీసులలో ఆడుదాం ఆంధ్ర అవకతవకలతో పాటుగా, అప్పట్లో రోజా మంత్రిగా వ్యవహరించిన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు కాంట్రాక్టులు, నిర్వహణ నిధుల వ్యయంలో జరిగిన కేటాయింపులపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ గతంలోనే దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా విచారణ అధికారులు కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. క్రీడా సామాగ్రి కొనుగోలు టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ప్రాథమిక నివేదికల ఆధారంగానే ఇప్పుడు రోజాకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/poloce-notices-to-former-minister-roja-39-227204.html





