సలహాదారులా.. మేతదారులా! స్టాలిన్ ను చూసి నేర్చుకో జగన్..
Publish Date:Jun 23, 2021
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికార పగ్గాలు చేపట్టి నిండా రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలోనే అటు పరిపాలన. ఇటు రాజకీయాలలో ఆయన తమ ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. పదవీ ప్రమాణ స్వీకారం చసిన రోజు నుంచే స్టాలిన్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారు. అందరి ఉహాలను తల్లకిందులు చేస్తూ, విద్వేష, ప్రతీకార రాజకీయాలకు తాను దూరమన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రతిపక్షాలకు, ప్రతిపక్ష నాయకులకు సముచిత గౌరవం ఇస్తూ అందరినీ కలుపుకు పోతున్నారు . ప్రతిపక్ష నాయకుల సలహాలు తీసుకుంటూ, లోకం ఎరిగిన తమిళ రాజకీకొత్త భాష్యం చెపుతున్నారు. అందుకే ప్రతిపక్షాలు కూడా స్టాలిన్‌ను శభాష్ అంటున్నాయి. చివరకు జయలలిత పేరిట గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటిన్లను, అదే పేరుతొ ఆమె బొమ్మతో అలాగే, కొనసాగిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి’ అనేలా తనను తాను మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు స్టాలిన్. సలహాదారుల నియామకంలోనూ తన దైన ముద్రను వేశారు స్టాలిన్. . రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అన్ని విధాల బలోపేతం చేసేందుకు, భారతీయ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ ప్రపంచ ప్రసిద్ద ఆర్థిక వేత్త రఘురామ రాజన్, మాజీ ప్రధాని మన్మోహన సింగ్ సలహాదారు, ఎంకే నారాయణ, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుభ్రమణ్యం వంటి నిష్టాతులను సలహాదారులుగా నియమించుకున్నారు. అలాగే, ఎంఐటీ ప్రొఫెసర్ ఈదర్ డేఫ్ల,మరో ప్రముఖ ఆర్థికవేత్త జెన్ డైజ్లు’లను కూడా సలహా దారులకు నియమించడం ద్వారా, స్టాలిన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న దృఢ సంకల్పాన్ని స్పష్తం చేశారు. అలాగే సలహాదారులు అంటే సలహాలు ఇచ్చే వారే కాని, వంధిమాగతులు, భజన భజన బృందాలు, రాజకీయ బేహారులు కాదని ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వినిపించేలా చెప్పారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ఇరుగు పొరుగు రాష్ట్రాలే అయినా, రెండు రాష్ట్రాల మధ్య పోలికలు పెద్దగా కనిపించవు. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అయితే, ఇద్దరూ వారసత్వ రాజకీయాలలో ఎదిగి రావడం,ఇద్దరు ఫస్ట్ టైం సీఎంలు కావడం వంటి పోలికలే కాని, రాజకీయ వ్యక్తిత్వం విషయంలో గానీ పరిపాలన వ్యవహరాలలో కానీ, నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్సాసం ఉందని ఇప్పటికే రాజకీయ పండితులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు నిండి పోయింది. స్టాలిన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష పార్టీలతో సమావేశమై రాష్ట్రాన్ని,దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహామ్మారి కట్టడి చర్యలపై చర్చించారు. కరోనాపై పోరులో భాగంగా స్టాలిన్ ఓ సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో 13 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. విశేషమేమిటంటే ఇందులో 12 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే కావడం. ఇక ఏపీలో ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో వేరే చెప్పనక్కర లేదు. ఇంతవఫకు కరోనా విషయంగానే కాదు, ఏ విషయంలోనూ ముఖ్యంత్రి జగన్ రెడ్డి విపక్షాలను విశ్వాసంలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ప్రతిపక్షాలనే కాదు స్వపక్షాన్నిఅయినా ముఖ్యమంత్రి విశ్వాసంలోకి తీసుకుంటారా అన్నది అనుమానమే అంటారు. సలహాదారుల విషయానికి ఏపీలోనూ సలహాదారులు చాలామందే ఉన్నారు. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే, వరసపెట్టి అసందీయులు అందరినీ సలహాదారులగా నియమించుకుంటూ పోయారు. అలా మొత్తం ఓ 33 మందిని వివిధ స్థాయిల్లో, హోదాల్లో, వేర్వేరు శాఖలకు, సలహాదారులుగా నియమించారు. అందులో, సీనియర్ సంపాదకులు కే. రామచంద్ర మూర్తి కొద్దికాలానికే, రాజీనామా చేసి తప్పుకున్నారు. ఇందులో కొందరికి కాబినెట్ హోదా కూడా ఇచ్చారు. అయితే, ఇందులో చాలామంది గురించి వారు ఎవరో, ఏమిటో, ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు. ఎవరి వరకో ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే, సజ్జల రామ కృష్ణా రెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ వంటి కొద్దిమంది మినహా మిగిలివారి ముక్కు ముఖం కూడా తెలియదు. అంతే కాదు, మిగిలిన వారిలో ఎక్కువమంది, ‘విగ్రహం పుష్టి నవైధ్యం నష్టి’ బాపతే అని కూడా అంటారు. జగన్ సలహాదారుల్లో ఎక్కువ మంది ఆయన ఎదుర్కొంటున్న సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్నవారే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమైన కొద్ది మంది మినహా మిగిలి సలహాదారులు ముఖ్యమంత్రి కలిసే సందర్భాలు, సలహాలు ఇచ్చే పరిస్థితులు కూడా పెద్దగా లేవని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. వీరంతా క్యాబినెట్ ర్యాంకును అనుభవించడం మీద అధికార పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందర్ని సలహాదారు అని వ్యవహరించకపోయినా... ప్రత్యేక అధికారి, కార్యక్రమ నిర్వహకుడు వంటి పేర్లతో నియమించారు. వీరందరికీ క్యాబినెట్ హోదాను ప్రభుత్వం కల్పించింది. ఇంకొందర్ని నేరుగా వివిధ శాఖల కింద సలహాదారులుగా నియమించింది ప్రభుత్వం. వీరికి ఒకొక్కరికి జీతభత్యాల కింద నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తోంది ప్రభుత్వం. దీనికి తోడు... పీఎస్, అడిషనల్ పీఎస్, అటెండర్, డ్రైవర్ల వంటి సిబ్బంది జీతాలు, కార్యాలయ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తోంది. రెండేళ్ళ పదవీ కాలం ముగిసిన సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి,మంత్రులకు సలహాదారులు అవసరమే, అయితే, స్టాలిన్ లా ఆయా రంగాల్లో నిపుణులు, నిష్టాతులు అయిన వారిని నియమించుకుని వారి సేవలను సద్వినియోగించుకుంటే, సరే, కానీ, సలహాదారుల పేరిట తెల్ల ఏనుగులను మేపడం, తన బినామీలను, కేసుల్లో సహ నిందితులుగా ఉన్న వారిని నియమించుకోవడం క్షమించరాని నేరం. నాట్ అడ్వైజబుల్, ఈ సలహా ఏ సలహాదారు ఇచ్చారో ఏమో గానీ, ఇంత దండగమారి సలహా మరోకటి ఉండదని అంటారు. జగన్ ఇకనైనా మేలుకో.. తమిళనాడు సీఎం స్టాలిన్ చూసి నేర్చుకో..
http://www.teluguone.com/news/content/political-expers-says-stalin-rocking-jagan-failure-cm-39-118183.html





