పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంఎల్ఎన్ ప్రభంజనం.!
Publish Date:Aug 6, 2026
Advertisement
పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. తీవ్ర ఉద్రిక్తతలు, బహిష్కరణ పిలుపుల మధ్య జరిగిన తొలి రెండు విడతల ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందే సమయానికి పీఎంఎల్-ఎన్ 34 స్థానాల్లో 24 స్థానాలను కైవసం చేసుకుని, దశాబ్దం తర్వాత పీవోకేలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమైంది. శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి అవామీ యాక్షన్ కమిటీ ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిలుపును జనం ఖాతరు చేయలేదు. పీవోకే రాజధాని ముజఫరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పీఎంఎల్ ఎన్, పీపీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ఈ నెల 10న జరగనుంది. మిగిలిన 11 స్థానాలకు పోలింగ్ ముగిసిన తర్వాత తుది ఫలితాలు వెలువడతాయి. PMLN sweep in pok elections, Nawaz Sharif, Party, Awami. boycott
http://www.teluguone.com/news/content/pmln-sweep-in-pok-elections-36-228144.html





