అమరావతి ఆలస్యంపై కోర్టు ధిక్కరణ కేసు.. జగన్‌కు మరో ఝలక్..
Publish Date:Apr 23, 2022
Advertisement
ఇటీవల హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అమరావతి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించింది. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని తేల్చి చెప్పింది. టైమ్‌బౌండ్ విధించి మరీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటిది హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదంటూ రాజధాని రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. బాధ్యులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలను శిక్షించాలంటూ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. రాజధాని అమరావతిని నిర్మించాలని, రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలను ఆదేశిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మార్చి 3న తీర్పిచ్చింది. భూసమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తేల్చిచెప్పింది. ఆ తీర్పు ప్రకారం అధికారులు వ్యవహరించకపోవడంతో రైతులు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో రాజధాని ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, పౌరులకు ఉచిత వైద్య సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు దక్కడం లేదన్నారు. న్యాయస్థానం తీర్పును అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వంగా ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. అధికారులతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల పాత్ర ఉన్నందున వారినీ కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని కోరారు. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి, మంత్రులేనని.. వారు న్యాయపాలనకు విఘాతం కలిగిస్తున్నారని.. కోర్టు ధిక్కరణ చట్టం సెక్షన్ 2(6) ప్రకారం ముఖ్యమంత్రి, ప్రతివాదులుగా ఉన్న మంత్రులు శిక్షకు అర్హులని పిటిషన్లో తెలిపారు. మరోవైపు, రాజధాని అమరావతిలో పనులు పూర్తి చేయడానికి 60 నెలల సమయం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్‌ను తిరస్కరించాలని కోరుతూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సీఎస్ అఫిడవిట్‌ను పరిశీలిస్తే, న్యాయస్థానం ఆదేశాల మేరకు అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుకూలంగా లేదని స్పష్టమవుతోందన్నారు. కోర్టుధిక్కరణ కేసు నుంచి తప్పించుకోవడానికే న్యాయస్థానం నిర్దేశించిన నెల గడువుకు ఒక రోజు ముందు అఫిడవిట్ వేశారన్నారు. కాలపరిమితి విధింపును తొలగించాలని కోరారన్నారు. ప్రధాన మౌలిక వసతుల నిర్మాణాలను నెలలో పూర్తి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేశారని ఆ కౌంటర్‌లో కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు. చట్టాలు చేయకుండా శాసన వ్యవస్థను న్యాయస్థానాలు ఆపలేవని వ్యాఖ్యానించారు. కోర్టులు చట్టాలు చేయకుండా అడ్డుకుంటున్నాయనే సందేశాన్ని ప్రజలకు పంపారని.. ఈ తీరు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరచడమే కాకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించడం కూడా అవుతుందని కౌంటర్‌లో అభిప్రాయపడ్డారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సీఎస్ వేసిన అఫిడవిట్‌ను తిరస్కరించమని కోరారు పిటిషనర్.
http://www.teluguone.com/news/content/pitition-in-high-court-on-amaravati-39-134833.html





