రాజాసింగ్ పై పీడీ యాక్ట్..ఇప్పట్లో జైలు నుంచి విముక్తి లేదా?
Publish Date:Aug 26, 2022
Advertisement
రాజాసింగ్.. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇప్పుడో సెన్సేషనల్ లీడర్. ధర్మం కంటే పార్టీ ఎక్కవేం కాదని కుండబద్దలు కొట్టేసిన వ్యక్తి. ఆయనే బీజేపీ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజా సింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి అరెరస్టు చేశారు. ఆ యాక్ట్ ప్రకారం అరెస్టయిన తొలి ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. ఇక పీడీ యాక్ట్ కింద రాజా సింగ్ ను అరెస్టు చేయడంతో ఆయన ఇక ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేనట్టేనని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టులో హాజరు పరిచే అవసరం ఉండదు. కనిష్టంగా మూడు నెలలు, గరిష్టంగా ఏడాది వరకూ ఆయనను జైల్లో ఉంచొచ్చు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమైన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి ఇంత వరకూ ఆయనపై 101 కేసులు నమోదయ్యాయి. అదనంగా 18 మత కల్లోలాల కేసులు ఉన్నాయి. పైగా రౌడీషీట్ కూడా ఉంది. ఈ కారణంగానే ఆయనపై పీడీయాక్ట్ ప్రయోగించామని కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపైనే పీడీయాక్ట్ నమోదు చేస్తూంటారు. కానీ రాజకీయ నేతలపై మాత్రం ఎప్పుడూ అమలు చేయలేదు. అయితే రాజాసింగ్‌పై మాత్రం అమలు చేశారు. అంతే కాకుండా ఒక వర్గం వారి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింద. దీంతో ఆయనకు పార్టీ పరంగా మద్దతు లభించే అవకాశం లేదని తేలిపోయింది. సున్నితమైన అంశం కనుక ఆయనకు ఎటువైపు నుంచీ కూడా మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో ఆయన ఇప్పటిలో బయటకు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/pd-act-on-rajasingh-when-will-be-he-relase-from-jail-25-142673.html





