జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో పరిమళ్ నత్వానీ విజయం!
Publish Date:Jun 18, 2026
Advertisement
జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. బీజేపీ, ఎన్డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో మొదటి స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) అభ్యర్థి బైజనాథ్ రామ్ సునాయాస విజయం సాధించారు. ఇక రెండో స్థానంలో ఎవరు గెలుస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఘ నెలకొంది. రాజ్యసభ బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపునకు కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం కాగా.. పరిమళ్ నత్వానీకి ఖచ్చితంగా 28 ఓట్లు లభించడం విశేషం. మరోవైపు, అధికార కూటమి అండతో గెలుపుపై కొండంత ధీమాతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ 81 ఓట్లలో నత్వానీ తనకు కావలసిన 28 ఓట్లను సాధించి గెలుపు బావుటా ఎగురవేశారు. వాస్తవానికి జార్ఖండ్ అసెంబ్లీలో జెఎమ్ఎమ్, కాంగ్రెస్-ఆర్జేడీ అధికార కూటమికి కలిపి స్పష్టంగా 56 మంది ఎమ్మెల్యేల భారీ బలం ఉంది. సాధారణ రాజకీయ లెక్కల ప్రకారం చూస్తే జెఎమ్ఎమ్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కూడా చాలా సులభంగా విజయం సాధించాలి. కానీ.. కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న ఎన్డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థిగా పరిమళ్ నత్వానీని రంగంలోకి దించి మైండ్ గేమ్ ఆడింది. ఈ రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ ఓట్లను కొల్లగొట్టింది. అధికార కూటమి అభ్యర్థి ప్రణవ్ ఝాకు కేవలం 20 ఓట్లు మాత్రమే రావడం వెనుక అధికార కూటమిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేటతెల్లం అయ్యింది. కొందరు అధికార పక్ష ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ నత్వానీకి ఓట్లు వేశారు.
http://www.teluguone.com/news/content/parimal-nathwani-wins-in-jharkhand-rajya-sabha-elections-39-223470.html





