కరాచీ దాడికి పాక్ రివెంజ్.. సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత!
Publish Date:Jun 29, 2026
Advertisement
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు మరోసారి రణరంగాన్ని తలపిస్తున్నాయి. కరాచీలో పారామిలిటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లో ఆదివారం (జూన్ 28) భారీ ఆపరేషన్ చేపట్టింది. కరాచీపై జరిగిన దాడికి క్షణాల్లో స్పందించిన పాక్ రక్షణ దళాలు వ్యూహాత్మక దాడులు నిర్వహించాయి. ఈ మెరుపు దాడుల్లో మోస్ట్ వాంటెడ్ కమాండర్‌తో సహా మొత్తం 28 మంది ఉగ్రవాదులను పాక్ మట్టుబెట్టింది. ఈ విషయాన్ని పాక్ సమాచార మంత్రి అతావుల్లా తారార్ అధికారికంగా ప్రకటంచారు. కరాచీలో శనివారం (జూన్ 27)సింధ్ రేంజర్స్ ప్రాంతీయ కార్యాలయంలోకి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు భారీగా నింపిన ఒక వాహనంతో ఒక్కసారిగా దూసుకెళ్లి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు పాకిస్థాన్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడే మరణించారు. అంతేకాకుండా, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాదిని పాక్ సైన్యం సజీవంగా పట్టుకుని కీలక సమాచారాన్ని రాబట్టింది. ఈ ఘోర దాడికి తామే బాధ్యులమని నిషేధిత పాకిస్థానీ తాలిబాన్ (టీటీపీ) నుంచి విడిపోయిన 'జమాత్-ఉల్-అహ్రార్' అనే ఉగ్రవాద సంస్థ బహిరంగంగా ప్రకటించుకుంది. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన పాక్ ప్రభుత్వం, సైన్యం ఆదివారం (జూన్ 28) ఉదయం నుంచే ఆఫ్ఘన్ సరిహద్దులోని బాజౌర్ జిల్లాలో దాడులు ప్రారంభించాయి. అత్యంత పకడ్బందీగా సాగిన ఈ ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ కమాండర్ ఖాన్ ఫరోష్'సహా ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల అనంతరం, పాక్ వైమానిక దళం రంగంలోకి దిగి ఆఫ్ఘనిస్థాన్ భూభాగంలో ఉన్న ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. అఫ్గానిస్థాన్ పరిధిలోని పక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై కచ్చితమైన వైమానిక దాడులు జరిపింది. ఈ వైమానిక దాడుల్లో మరో 25 మంది ఉగ్రవాదులు మరణించారనీ, వారి ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని మంత్రి అతావుల్లా తారార్ వివరించారు. ఈ ఆకస్మిక మరియు తీవ్రమైన దాడులతో ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరాయి. తమ దేశంలో నిరంతరం దాడులకు పాల్పడుతున్న టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే కాబూల్ లోని ఆఫ్ఘన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.
http://www.teluguone.com/news/content/pakistans-retaliation-for-the-karachi-attack-36-224433.html





