గండిపేట భూముల నకిలీ జీవో కేసులో దర్యాప్తు ముమ్మరం.. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరార్
Publish Date:Jun 2, 2026
Advertisement
హైదరాబాద్ పరిధిలోని గండిపేటలో వందల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించి నకిలీ జీవోలు సృష్టించిన కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రహ్మనాయుడు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సైబరాబాద్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో ఉన్న ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడు తన అనుచరులతో కలిసి కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితులు అక్రమంగా నకిలీ జీవోలను తయారు చేసి.. వాటి ఆధారంగా వందల కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసే కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మాజీమంత్రి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. భూములపై హక్కులు సాధించినట్లు చూపిస్తూ నకిలీ జీవోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందిన ఈ పత్రాలపై నిఘా పెట్టిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, బ్రహ్మనాయుడు, రాధాకృష్ణ కలిసి మరికొన్ని నకిలీ జీవోలను కూడా సృష్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను గుర్తించగా, ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మరో కీలక నిందితుడైన రాధాకృష్ణపై ఇప్పటికే తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, కడప జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత ప్రమేయం కూడా ఈ కేసులో ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి విచారణలో మరిన్ని నకిలీ జీవోలు, భూ కబ్జాలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/nvestigation-intensifies-in-gandipet-land-fake-go-case-36-221548.html





