తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్!
Publish Date:Jun 29, 2026
Advertisement
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం (జూన్ 28) అర్ధరాత్రి తెలంగాణ బీజేపీ కీలక నేతలతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా.. గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే చూస్తూ ఊరుకోబోమని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే బీజేపీ కేవలం తన సొంత బలంతో, క్షేత్రస్థాయి పోరాటాలతో ఎదిగి అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్పిన నితిన్ నబీన్.. అందుకు భిన్నంగా తెలంగాణలో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నాయకుల అలసత్వం, గ్రూపు రాజకీయాలు, విభేదాల కారణంగా పార్టీ వెనుకబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఏ నాయకుడు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో యాక్టివ్గా ఉన్నారో, ఎవరు పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారో అనే పూర్తి వివరాలు, గణాంకాలు తన వద్ద ఉన్నాయని నితిన్ నబీన్ చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, అలాగే జీహఎచ్ఎంసీ సంస్థల ఎన్నికలను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/nitin-nabin-warns-telangana-bjp-leaders-39-224434.html





