రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు
Publish Date:Jun 12, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీధర్ నాయక్ (39) ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది. జూన్ 1న తుర్కయాంజల్‌లోని శ్రీరామ్‌నగర్ కాలనీలో తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆయన బలవన్మ రణానికి పాల్పడ్డారు. మృతుడి భార్య సరోజ ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో లోన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయుడు వేధింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకు న్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న శ్రీధర్ నాయక్ మృతికి ముందు జరిగిన పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. కూతురి కాలేజీ అడ్మిషన్ కోసం పై అధికా రిని అనుమతి కోరిన అనంతరం ఇంటికి వచ్చిన ఆయనకు లోన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు పలు మార్లు ఫోన్ చేశాడని, ఆ తర్వాత కొద్దిసేపటికి తన భర్త గదిలోకి వెళ్ళి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చెప్తుంది.. భార్య సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు శ్రీనివాస్ నాయుడుపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అయితే, ఈ కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు చెందిన సుమారు రూ.33 లక్షల ప్రభుత్వ నిధుల మళ్లింపు వ్యవహారం బయటపడినట్లు సమాచారం. జిల్లా గిరిజన సంక్షేమ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఆడిట్‌లో ఈ అక్రమాలు బయటపడతా యనే భయంతోనే శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పదేళ్లుగా మూతపడ్డ బ్యాంకు ఖాతాను తిరిగి ప్రారంభించి లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన అధికారులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చెందిన శంషాబాద్, హస్నాపూర్, పీర్జాదిగూడ, భువనగిరి శాఖల నలుగురు మేనేజర్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీధర్ బాబు 2012 నుంచి ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో నమ్మకంగా పనిచేస్తున్నారని సహోద్యోగులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ కేసులో వేధింపుల ఆరోపణలు, ఆర్థిక అక్రమాల అనుమానాలు, బ్యాంకు ఖాతాల వ్యవహారం వంటి అన్ని కోణాల్లో పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/new-angles-in-rangareddy-collectorate-employee-suicide-case-36-222730.html





