ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్? కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్
Publish Date:Jun 6, 2025

Advertisement
కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో మంచి ప్రాధాన్యత ఉండేది. కాపులకు రిజర్వేషన్ అంటూ ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ఆయన ఉద్యమించిన సమయంలో లక్షలాదిగా యువత ఆయన వెంట నడిచారు. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాపు సామాజిక వర్గం ఆయనను తమ నాయకుడిగా అంగీకరించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం 2019 ఎన్నికలకు ముందు కాపు రిజర్వేషన్లకు సుముఖంగా ఉన్న చంద్రబాబును కాదని.. ఆ ప్రతిపాదనకు నో చెప్పిన జగన్ కు ముద్రగడ మద్దతు ఇచ్చారు.
ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది. 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.
ముద్రగడ నిర్ణయాన్ని ఆమె కుమార్తె క్రాంతి కూడా సమర్ధించలేకపోయారు. బహిరంగంగా ఆమె పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. 2024 ఎన్నిలకల తరువాత జనసేన గూటికి చేరారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ముద్రగడ ఆరోగ్యం బాలేదు. ఈ విషయాన్ని ఆయనే రెండు రోజుల కిందట ఓ లేఖ ద్వారా వెల్లడించారు. రెండు రోజుల కిందట వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట నిరసనలు చేపట్టింది. అయితే ఆ కార్యక్రమంలో ముద్రగడ పాల్గొన లేదు. కానీ ఓ లేఖ విడుదల చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను బయటకు రాలేకపోతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న చర్చ మొదలైంది. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాలేదు. దీంతో ఆయన అభిమానుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. ఈ తరుణంలో ఆయన కుమార్తె క్రాంతి తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారని వెల్లడించారు. అంతే కాదు.. తన సొంత సోదరుడు ముద్రగడ గిరి ఆయనకు వైద్యం అందకుండా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ, ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్ చేశారు. తన తండ్రిని చూసేందుకు కూడా తనను అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ముద్రగడను నిర్బంధించి, చికిత్స కూడా అందకుండా చేస్తున్నారని, కనీసం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇటీవల ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో కలిసి తన తండ్రిని చూడడానికి వెడితే.. తన సోదరుడు గిరి, అతడి మావ తనను అనుమతించలేదని ఆరోపించారు.
http://www.teluguone.com/news/content/mudragada-padmanabham-sufferinf-eith-cancer-39-199442.html












