'మా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ'! జగన్ పై రఘురామ సెటైర్లు..
Publish Date:Jun 29, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో కొన్ని రోజులుగా ఆయన వరుసగా లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఆయన రియాక్ట్ అవుతున్నారు. ఈ సారి జగన్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఏపీ హౌజింగ్ స్కీమ్ పై స్పందించారు. రాష్ట్రంలో 2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఇళ్ల నాణ్యత నాసిరకంగా ఉందన్నారు. ఒకసారి ఇళ్లను నిర్మించే ప్రదేశానికి వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జగన్ను కోరుతున్నానని లేఖలో చెప్పారు ఎంపీ రఘురామ రాజు. ఏపీలో 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్రణాళికలు వేశారని లేఖలో రఘురామ తెలిపారు. ముందుగా రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. తర్వాత అంచాను రూ.70,000 కోట్లకు పెంచిందని చెప్పారు. మరికొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నామంటూ వర్చువల్ విధానంలోనే ఇప్పటికే నాలుగు సార్లు కార్యక్రమాలు నిర్వహించారని రఘురామ రాజు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే యమలీల చిత్రంలోని 'మా చెల్లి పెళ్లి...జరగాలి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ గుర్తుకు వస్తోందని ఎంపీ రఘురామ రాజు సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని రఘురామ సూచించారు. పేదవారికి ఇళ్లు ఇచ్చే విషయంలో సరైన రీతిలో వ్యవహరించాలని కోరారు.
http://www.teluguone.com/news/content/mp-raghurama-raju-letter-to-cm-on-housing-scheme-39-118592.html





