ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు బెయిలు కావాలట.!
Publish Date:Aug 12, 2026
Advertisement
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా రాజమంత్రి ప్రత్యేక కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ పిటిషన్ లో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షా కాల సమావేశాలలో ప్రజా సమస్యలపై గళం వినిపించడానికి తనకు బెయిలు మంజూరు చేయాలని కోరడం ఇప్పుడు రాజకీయవర్గాలలోనే కాకుండా జన బాహుల్యంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రజా సమస్యలపై మాట్లాడటానికి, తన నియోజకవర్గ ప్రజల తరఫున గళం విప్పడానికి తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తన బెయిల్ పిటిషన్ లో అభ్యర్థించారు, డిసెంబర్ 2021 నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనంత బాబు.. గతంలో సభలో ప్రజా సమస్యలపై ఎంతవరకు గళమెత్తారనే విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఆయన వినిపిస్తున్న వాదన విమర్శలకు దారితీస్తోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే బెయిల్ కావాలని ఆయన అడుగుతుంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నవైసీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది. కేవలం జైలు నుంచి బయటకు రావడం కోసమే ప్రజా సమస్యల నెపంతో బెయిల్ డ్రామాలు ఆడుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా అనంతబాబు మండలిలో గళమెత్తిన సందర్భాలు దాదాపు మృగ్యమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి సభలో ప్రజా సమస్యలపై ఏం మాట్లాడుతారని నిలదీస్తున్నారు. మొత్తం మీద అనంతబాబు బెయిలు పిటిషన్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఆయన బెయిలు దరఖాస్తుపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. MLC Anantha Babu Bail Petition, YCP Assembly Boycott, Rajahmundry Central Jail, Raise Public Issues, Sasanamandali, Dead Body, Door Delivary
http://www.teluguone.com/news/content/mlc-anantha-babu-bail-petition-36-228775.html





