ముస్లింలతో మమత ఓటు బ్యాంకు రాజకీయాలు.. అసద్
Publish Date:Apr 14, 2026
Advertisement
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. తృణమూల్ కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ వారి పట్ల సవతితల్లి ప్రేమను చూపుతోందన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి, వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారన్నారు. ముర్షీదాబాద్ జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 13) నిర్వహించిన భారీ ఎన్నికల బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని హల్దియా, ఖరగ్‌పుర్ వంటి ప్రాంతాల అభివృద్ధిని ప్రస్తావించిన అసదుద్దీన్ ఒవైసీ.. ముర్షీదాబాద్ వంటి జిల్లాలో కనీసం ఒక్కటంటే.. ఒక్క ప్రత్యేక ఆర్థిక మండలి కూడా కూడా ఎందుకు ఏర్పాటు కాలేదని విమర్శించారు. బిజెపి బూచి చూపి.. ముస్లింలలో భయాందోళనలు సృష్టించి ఎన్నికలలో లబ్ధి పొందాలని తృణమూల్ ప్రయత్నిస్తోందన్నారు. రఘునాథ్ గంజ్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ముర్షీదాబాద్ రూపురేఖలు మారుస్తామని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ఎంఐఎం పోరాడుతుందన్న ఆయన, ముర్షీదాబాద్‌లో పారిశ్రామికాభివృద్ధి కోసం ఎంఐఎం అభ్యర్థిని గెలిపిం చాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో అసదుద్దీన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో అసదుద్దీన్ వ్యాఖ్యలు ఎన్నికలలో ఏ మూరకు ప్రభావితం చేస్తాయన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసదుద్దీన్ వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/mamata-votebank-politics-with-muslims-25-217315.html





