మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు
Publish Date:Jul 16, 2025
.webp)
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను మంగళవారం (జులై 15) హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని కోర్టు పేర్కొంది.
దీంతో ఆయనకు అరెస్టు నుంచి ఎటువంటి రక్షణా లేకుండా పోయింది. ఇప్పటికే సుప్రీం కోర్టు బెయిలు విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా ఈ లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే మిథున్ రెడ్డి కదలికలపై కూడా సిట్ నిఘా పెట్టింది. దీంతో మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకావాలున్నాయని అంటున్నారు.
ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, మాజీ సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, మాజీ ఓఎస్డీగా కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్, చార్టర్డ్ అకౌంటెంట్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులను సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరంతా ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/lookout-notices-on-miyhunreddy-39-202068.html












