అబద్ధాల అవధాని లక్ష్మీపార్వతి!
Publish Date:Jun 12, 2024
Advertisement
నోరున్నది ప్రత్యర్థులను ఆడిపోసుకోవడానికే, వారిపై ఇష్టారీతిన విమర్శలు చేయడానికే. ఆధారాలు అక్కర్లేదు. వాటిని నిరూపించాల్సిన అవసరం లేదు. మసిగుడ్డ చేతిలో ఉన్నట్లు నోట్లో నాలుక ఉంది. చాలు మాటలు అనేయడమే. మంచీ చెడు విచక్షణ అవసరం లేదు. సమంజసమా కాదా అన్న ఆలోచన లేదు. తాము అంటున్నాం సరే జనం కనీసం నమ్ముతారా, నవ్విపోతారా అన్న సంశయం లేదు. నోటికి ఏది వస్తే అది ఎంతొస్తే అంతా అనేయడమే. గత ఐదేళ్లుగా అధికారంలో ఉండి వైసీపీ అధినేత సహా నేతలు చేసినది అదే. అభివృద్ధిని విస్మరించి ప్రత్యర్థులపై కక్షసాధింపులు, వేధింపులు, దూషణలే పాలన అంటే... అధికారం అంటే పెత్తనం చెలాయించడం, ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం అన్నట్లుగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఓటమి తరువాత కూడా ఆ వైఖరి మార్చుకోలేదు. ఓటమికి కారణం విపక్ష నేతలే అంటూ సాకులు చెప్పడమే కాదు, ఎవరూ నమ్మడానికి కూడా అవకాశం లేని విధంగా ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విన్న వారు నోట మాట రాక నిరుత్తురులౌతున్నారు. ఇలా కూడా మాట్లాడే మనుషులుంటారా? వీళ్లని మనుషులనొచ్చా అని ఆశ్చర్య పోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి.. చంద్రబాబునాయుడు సింగపూర్ లో కూర్చుని టెక్నాలజీని ఉపయోగించి ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు ఆ ట్యాంపరింగ్ టెక్నాలజీని రాజమహేంద్రవరం జైల్లో నేర్చుకున్నారని ఆరోపించారు. స్కిల్ కేసులో జగన్ సర్కార్ ఆయనను అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్నే గుర్తు చేస్తూ లక్ష్మీ పార్వతి జగన్ సర్కార్ స్కిల్ కేసులో అన్ని ఆధారాలతో నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తే.. ఆయన అక్కడ కూర్చుని ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయాలో నేర్చుకున్నారని చెబుతున్నారు. జైలులో ఉన్న రహస్య ప్రదేశాలలో ట్యాంపరింగ్ ఎలా చేయాలో నేర్పేవారున్నారట. అలా హరిప్రసాద్ అనే ఆయన చంద్రబాబుకు ఈవీఎంల ట్యాంపరింగ్ విద్య నేర్పించాడట. ఆ విద్యను ఉపయోగించి చంద్రబాబు ఎలక్షన్ గెలిచారట. లక్ష్మీపార్వతి విమర్శలపై ఆమెను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/lakshmi-parvathy-alleges-cbnlearned--evm-tampering-in-jail-25-178460.html





