కేటీఆర్‌కి శవాలు కావలెను!
Publish Date:Jun 25, 2024
Advertisement
ప్రస్తుతం పెద్దగా పనేం లేదు కాబట్టి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శవాల కోసం అన్వేషిస్తున్నారు. ఎక్కడెక్కడ చావులు జరిగాయా, ఆ చావులను ప్రభుత్వం మీద నెట్టేసి శవరాజకీయం చేద్దామా అని తహతహలాడుతున్నారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేతులు ఎత్తేసి ఫామ్‌హౌస్‌లో ‘టానిక్’ తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిపోయినట్టు కలలు కని, ఆ కలలన్నీ కల్లలైపోయిన కేటీఆర్ మాత్రం ఏం చేసయినా మళ్ళీ అధికారంలోకి రావాలని తంటాలు పడుతూ, అప్పుడప్పుడు ట్విట్టర్లోకి వచ్చి కామెంట్లు పోస్టు చేస్తూ అధికార పార్టీ మీద ‘పోరాటం’ చేస్తున్నారు. అధికార పార్టీని తిట్టడానికి ఏ సాకూ దొరక్కపోతే, చచ్చిన వాడికి వచ్చిందే కట్నం అన్నట్టుగా, తన రాజకీయాల కోసం శవాలను ఉపయోగించుకుంటూ శవరాజకీయ దురంధరుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. గతంలో ఉద్యమకారుల శవాల మీద నడిచి అధికారాన్ని సంపాదించుకున్నారు కదా.. ఆ అలవాటు ఎక్కడకి పోతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో ఎక్కడ, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో వేస్తూ కేటీఆర్ ఆత్మానందం పొందుతున్నారు. ఏ వృత్తిలో వున్న వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఆ ఫలానా వృత్తికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం పదిరోజుల నుంచే కేటీఆర్ ఈ రకం రచ్చ చేయడం ప్రారంభించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఇంత కొద్ది కాలంలో కాంగ్రెస్ పార్టీ అంత దారుణాలు ఏం చేసింది? ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఏ వృత్తిలో వున్న వారికి అన్యాయం చేసింది? నిజానికి ఇప్పుడు ఏ వృత్తిలో వున్నవారు ఆత్మహత్య చేసుకున్నా, అది గత పదేళ్ళుగా అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ పార్టీనే కారణం అవుతుంది తప్ప... నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కారణం అవుతుంది? సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులు ఈమధ్యకాలంలో ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని కేటీఆర్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. మరి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యేనే కదా.. మరి ఆయన అద్భుతమైన పరిపాలనలో వున్నప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకూడదు కదా... కేసీఆర్ కుటుంబం మాటలు జనం నమ్మే రోజులు పోయాయి. ఇప్పటికైనా కేటీఆర్ ఈ శవాల వేట మానుకుంటే మంచిది.
http://www.teluguone.com/news/content/ktr-searching-dead-bodies-25-179429.html





