కన్నతల్లే కసాయి... రెండేళ్ల చిన్నారి హత్య వెనుక షాకింగ్ కుట్ర
Publish Date:Jun 22, 2026
Advertisement
రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు... మేడ్చల్–మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కనిపించిన ఈ ఘటన వెనుక తల్లి, ఆమె ప్రియుడి కుట్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్నతల్లే తన ప్రియుడితో కలిసి పసిబిడ్డను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. కీసర మండలం చెర్యాల గ్రామంలోని ఈడెన్ గార్డెన్స్‌కు చెందిన రంగా స్వామి, జూన్ 13న తన రెండేళ్ల కుమారుడు రంగా హరికృష్ణ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మే 29న బాలుడు ఇంట్లో పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తల్లి రంగా జ్యోతి కుటుంబ సభ్యులను నమ్మించింది. ఘటనపై అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో కీసర పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించారు. ఈ క్రమంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో జ్యోతి, మొగిళ్ల నవీన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజే నవీన్ ఇంటికి వచ్చినట్లు, అనంతరం బాలుడిని ఆస్పత్రికి తరలించడంలో కూడా అతడు పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో అనుమానం మరింత బలపడగా, జూన్ 19న బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పోలీసుల విచారణలో జ్యోతి, నవీన్ ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. తమ అక్రమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించి ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు వెల్లడైంది. నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టి చంపగా, తల్లి జ్యోతి అతనికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించే ప్రయత్నంలో బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ కేసులో ప్రధాన నిందితులైన మొగిళ్ల నవీన్, రంగా జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు వివరాలను జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి మీడియాకు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/keesara-child-murder-case-36-223807.html





