గద్దర్ కు దళిత బంధు బాధ్యతలు? టీఆర్ఎస్ నేతల మంతనాలు..
Publish Date:Aug 31, 2021
.jpg)
Advertisement
తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా వేడెక్కాయి. కాంగ్రెస్ దళిత గిరిజన దండోరాలతో స్పీడ్ పెంచింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అధికార పార్టీ దళిత బంధు స్కీం తీసుకొచ్చింది. త్వరలో మరిన్ని బంధులు తెస్తామని చెబుతున్నారు సీఎం కేసీఆర్. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిల కూడా జిల్లాలు చుట్టేస్తున్నారు. అన్ని పార్టీల లక్ష్యం హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే సాగుతోంది.
తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నాయకుల వలసలు కూడా జోరందుకున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలను ప్రభావితం చేసే నేతలను తమ బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. ఇందులో భాగంగానే ప్రజా గాయకుడు గద్దర్‌పై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. అల్వాల్ భూదేవినగర్‌లోని నివాసంలో గద్దర్‌తో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చర్చలు జరిపారు. దాదాపు గంటకు పైగా వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే టీఆర్ఎస్ నేతలు గద్దర్ చర్చలు జరిపారని తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంతో గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని, ఈ ప్రతిష్టాత్మక పథకంతో ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని వారు గద్దర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరినట్లు సమాచారం. అంతేకాదు దళిత బంధు బాధ్యతలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ మాటగా గద్దర్ కు మంత్రి కొప్పుల ఆశ్వర్ చెప్పారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ ప్రతిపాదనపై గద్దర్ ఇంకా హామీ ఇవ్వలేదన చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనపై గద్దర్ సానుకూలంగా స్పందిస్తారనే ఆశతోనే ఉన్నారు.
గద్దర్ తో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపాడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో గద్దర్ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులపై చర్చించడానికి తనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన కొన్ని రోజుల్లోనే.. టీఆర్ఎస్ నేతలు గద్దర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డితో రాజకీయాలపైనా గద్దర్ చర్చించారనే సమాచారం టీఆర్ఎస్ పెద్దలకు వచ్చిందట. హుజూరాబాద్ ఎన్నికల్లో గద్దర్ బీజేపీకి మద్దతు తెలిపితే.. టీఆర్ఎస్‌కు ఇబ్బందులు వస్తాయని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే అప్రమత్తమై.. గద్దర్ మద్దతు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సీఎం కేసీఆర్ పంపించారనే ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి విప్లవ భావజాలమున్న గద్దర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం... టీఆర్ఎస్ నేతలు ఆయనతో మంతనాలు సాగించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లీకులు వస్తున్నట్లుగా దళిత బంధు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం కోరితే.. అందుకు గద్దర్ ఓకె చెబుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలతో గద్దర్ ఎలా వ్యవహరించబోతున్నారన్నది కూడా చర్చగా మారింది.
http://www.teluguone.com/news/content/kcr-team-talks-with-gadder-for-dalith-bandhu-scheme-39-122249.html












