బ్యారేజీలకు నష్టం వాటిల్లితే.. 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా.. కౌశిక్ రెడ్డి సవాల్.!
Publish Date:Jul 15, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సవాల్ విసిరారు. మేడిగడ్డ వద్ద గోదావరి నది గుండా ప్రతిరోజూ 9 టీఎంసీల నీరు వృథాగా పోతోందన్న ఆయన.. ఇంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తోందని విమర్శించారు. ఈ వైఖరి వల్ల ఉత్తర తెలంగాణలోని లోయర్ మానేరు, మిడ్ మానేరు ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే కాళేశ్వరం మౌలిక సదుపాయాలను వినియోగించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తాము చేసిన అబద్ధాల ప్రచారాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే కన్నెపల్లి పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. నీరిస్తే రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, రైతు భరోసా నిధులు చెల్లించాల్సి వస్తుందనే నెపంతోనే ఈ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా, గత రబీ సీజన్లో ప్రభుత్వం సేకరించిన మొక్కజొన్న పంటకు సంబంధించి దాదాపు 30 శాతం మంది రైతులకు ఇప్పటికీ అమ్మకపు సొమ్ము బకాయిలు అందలేదన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు. ఆ నష్టానికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు తక్షణమే రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఫేజ్-2 కోసం కేంద్రానికి లేఖలు రాయడంపై పెడుతున్న శ్రద్ధను, బ్యారేజీల మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాయడంపై పెట్టడం లేదని విమర్శించారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగితే ఉత్తర తెలంగాణలో సాగునీటి కొరతే కాకుండా తీవ్ర తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ హెచ్చరించింది. aleshwaram Project Row, Padi Kaushik Reddy Challenge, Revanth Reddy BRS, Kannepalli Pump House, Telangana Politics, BRS MLAs Resignation
http://www.teluguone.com/news/content/kaushik-reddy-challenge-revanth-25-226044.html





