కమలం దక్షిణాది జపం?
Publish Date:Jul 5, 2025

Advertisement
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురంధరేశ్వరి, వనతీ శ్రీనివాసన్.. ఈ ముగ్గురికీ కీలక పదవులు దక్కనున్నట్టు సమాచారం. నిర్మలా సీతారామన్ ఆల్రెడీ ఆర్ధిక మంత్రిగా సుప్రసిద్ధం. ఆమెను జాతీయ అధ్యక్షురాలిని చేస్తే.. అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ నిర్వహణ ఎవరికి అప్పగించాలన్నదొక చర్చ? ఎందుకంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తరువాత అత్యంత కీలకమైన శాఖ ఆర్థిక శాఖే. అంతే కాకుండా మోడీ పాలసీలో ఫైనాన్స్ మినిస్ట్రీ అత్యంత ప్రధానమైన.. మోస్ట్ ఇంపార్టెంట్ శాఖ. ఇక్కడ పీకలోతు పని ఉంటుంది. అందులోంచి ఆమె ఇటు పార్టీ అధ్యక్ష పదవిని మోయాల్సి రావడం అంటే అది సాధ్యమేనా? అన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పార్టీ పగ్గాలు నిర్మలా సీతారామన్ కు అప్పగిస్తే.. రాష్ట్రపతిగా ఒక మహిళకు పట్టం గట్టడమే కాకుండా పార్టీ పగ్గాలు మరో మహిళకు అప్పగించిన ఘనత బీజేపీకి దక్కుతుంది. అందు కోసం ఆర్ధిక శాఖను మరొకరికి ఇచ్చి నిర్మలా సీతారామన్ కు పార్టీ పగ్గాలు అప్పగించే యోచన హైకమాండ్ చేస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేస్తూ అధ్యక్షులు ఉన్నవారు ఎవరు అంటే.. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా ఉన్నారు. వారు ఇటు మంత్రి పదవి నిర్వహిస్తూనే అటు అధ్యక్ష బాధ్యతలూ చేపట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా కేంద్ర ఆరోగ్య మరియు రసాయన శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నిర్మలా సీతారామన్ అధ్యక్షురాలైతే ఆమె జోడు గుర్రాల సవారీ చేయాల్సి ఉంటుంది.
ఇక దగ్గుబాటి పురందేశ్వరిని జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిని చేయాలన్న ఆలోచనతో అధిష్టానం ఉందంటున్నారు. ఇప్పటికే ఆమె ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేయడంలో కీలక భూమిక పోషించారు. దీంతో కేంద్ర అధిష్టానం ముందు ఆమె ర్యాంకింగ్ బాగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇచ్చిన టాస్క్ ఇచ్చినట్టు నెరవేర్చడంలో మోడీ షాల దగ్గర పురందేశ్వరికి గుడ్ మెరిట్సే ఉన్నాయి. కాబట్టి ఆమెకు పార్టీలో కీలక పదవి లభించే అవకాశముంది.
ఇక వనతీ శ్రీనివాసన్ ఎవరని చూస్తే అంత డీఎంకే హవాలోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ లో అది కూడా ఒక పార్టీ అధ్యక్షుడైన కమల్ హాసన్ పై గెలిచారామె. ప్రస్తుతం తమిళ శాసన సభలో ఉన్న ఏకైక బీజేపీ మహిళా నేత. ఒక రకంగా చెబితే ముగ్గురూ ముగ్గురే. ఇప్పటికే నిర్మలా సీతారామన్ జీఎస్టీ ద్వారా దేశ ఆర్ధిక స్థితిగతులను మెరుగు పరిచిన ఆర్ధిక మంత్రిగా ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో బలమైన పొజిషన్లోనే ఉన్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో ఆమె భేటీ అయ్యారు.
బేసిగ్గా జేపీ నడ్డా అధ్యక్ష పదవీ కాలం 2023 జనవరితోనే ముగిసింది. అయితే 2024 లో ఎన్నికల కారణంగా జూన్ వరకూ పొడిగించారు. అప్పటికీ ఏడాది గడచిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం. సరిగ్గా ఇక్కడే పార్టీ పగ్గాలను మహిళా నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అది కూడా దక్షిణాది మహిళకు అప్పగించాలని అనుకుంటోంది. ఎందుకంటే ఇటు చూస్తే ఉత్తరాదిలో బీజేపీ సీట్లు బాగా తగ్గడం ప్రారంభించాయి. గత ఎన్నికల్లో చావు దప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి. ఈ క్రమంలో దక్షిణాది నుంచి గట్టి మద్దతు అవసరం ఉందని బీజేపీకి ఉంది.
అప్పటికీ దక్షిణాదిని కవర్ చేయడానికి ఎన్నెన్నో ప్రయోగాలు ప్రయత్నాలు అవార్డులు- రివార్డులు- రాజ్య సభ్యత్వాలు ఇచ్చి చూస్తున్న బీజేపీకి తగిన గురి కుదడం లేదు. దక్షిణాదిలో కేంద్ర మంత్రి పదవులు పొందిన వారెవరని చూస్తే తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు కిషన్, బండి సంజయ్. ఇక కేరళ నుంచి సురేష్ గోపీ మాత్రమే బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇక్కడ కావల్సింది ఒక సౌత్ ఐకానిక్ ఫేస్. ఒక పక్క సనాతన వారధిగా సారధిగా పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తూ సైడ్ వర్క్ ప్రారంభించింది బీజేపీ అధినాయకత్వం. అయితే సౌత్ కి ఒక బలమైన బీజేపీ ముఖచిత్రం లేదు. గతంలో ఎలా చూసినా కూడా కనిపించిన ఒకే ఒక్క ఫేస్. యడ్యూరప్ప. ఆయన ఎరా ముగియటంతో.. ఇప్పుడు కొత్త ముఖచిత్రం అందునా మహిళ అయితే బాగుండునని చూస్తున్నారు.
అలాగని నిర్మలా సీతారామన్ ని అధ్యక్షురాలిగా చేయడం వల్ల కేవలం మహిళా కేటగిరికి మాత్రమే సరిపోతుంది. బేసిగ్గా బీజేపీని గెలిపించిన మహిళా ఓటర్లు అధికశాతం గల రాష్ట్రాలేవని చూస్తే అవి మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ. అలా చూసినా కూడా సౌత్ లో ఏ స్టేట్ కూడా ఈ కేటగిరీ కిందకు రాదు. దానికి తోడు నిర్మల ప్రత్యక్ష రాజకీయాల పరిధిలోకి రాని లేడీ లీడర్. ఆమె ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నై లోని ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుదామనుకున్నారు కానీ, ఎందుకో అది వర్కట్ కాలేదు.
దానికి తోడు స్వయంగా ఆమె.. ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి ఖర్చు చేసేంత స్థోమత తనకు లేదని తెగేసి చెప్పారు. సరిగ్గా అదే సమయంలో దక్షిణాదిలో గెలవాలంటే కులం గానీ, మతం గానీ ఎక్కువ చూస్తారని తెగేసి చెప్పిన స్వభావం గలవారామె. ఈ క్రమంలో నిర్మల కేవలం ఒక ముఖచిత్రంగా మాత్రమే ఉంటారు తప్పించి.. ప్రత్యక్ష రాజకీయాలను ప్రభావం చేసే పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు.
ఇక పురందేశ్వరి, వనతీ శ్రీనివాసన్ ఈ ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవజ్ఞులుగానే చెప్పాలి. పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీ నుంచి రాజమండ్రి ఎంపీగా గెలిచారు కూడా. ఈ లెక్కన పురందేశ్వరికి మంచి ఛాన్సులు ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ తనయగా మాత్రమే కాదు అటు బహుభాషా కోవిదురాలిగానూ పేరు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉండటం వల్ల.. ఆమెకు నేషనల్ లెవల్ ఎక్స్ పోజర్ కూడా ఉంది. అంతేనా ఇటీవలి కాలంలో ఆమె ఆపరేషన్ సిందూర్ ఇంటర్నేషనల్ టూర్ లో ఒసభ్యురాలు కూడా. అంటే అంతర్జాతీయంగానూ ఆమె తన సత్తా చాటారు. కాబట్టి.. అధ్యక్ష పదవికి ఈమె సరిగ్గా సరిపోతారు. కానీ అధిష్టానం ఆలోచన ఎలా ఉందో తెలీదు. ప్రస్తుతానికైతే పురందేశ్వరికి బీజేపీ మహిళా మోర్చా పదవి అయితే ఇచ్చేలా తెలుస్తోంది.
వనతీ శ్రీనివాసన్ ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లో రాణిస్తున్నారు కాబట్టి ఎంతైనా ఆమె జూనియర్ కిందే లెక్క. పార్టీ పదవులు ఎన్ని చేసినా.. వాటిని నేషనల్ ఎలెక్షనీరింగ్ స్థాయికి కి విస్తరించాలంటే అందుకు తగిన అనుభవం కూడా అవసరం. కాబట్టి ఈ ముగ్గురిలో బెస్ట్ సౌత్ ఫిమేల్ ఫ్యాక్టర్ ఆప్షన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో తేలాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/kamalam-party-utmost-importence-to-south-39-201315.html












